Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రాత్మక రైతు పోరాటం విజయం
- 378 రోజల తరువాత తిరిగి ఇండ్లకు
- ఈ విజయం 715 మంది అమరవీరులకు అంకితం
- శనివారం జాతీయ విజయ దినోత్సవం
- సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద విజయోత్సవాలు
- ఎంఎస్పీ కోసం పోరాటం కొనసాగుతుంది
- మళ్లీ జనవరి 15న ఎస్కేఎం భేటీ.. హామీలపై సమీక్ష
న్యూఢిల్లీ : చారిత్రాత్మక రైతు పోరాటం శనివారం (ఈ నెల 11న) ముగియనున్నది. మోడీ సర్కార్ సృష్టించిన అనేక అడ్డంకులు, అవరోధాలు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని సుదీర్ఘంగా సాగిన ఈ పోరాటం విజయవంతం కావడంతో రైతులు 378 రోజుల తరువాత ఇండ్లకు తిరిగి వెళ్లనున్నారు. రైతులు ప్రభుత్వం ముందుంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని ఎస్కేఎం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీతో జాతీయ రహదారుల దిగ్బంధనం ఎత్తివేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. ఈ 11న జాతీయ విజయ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పంపిన లిఖితపూర్వక ప్రతిపాదనల ముసాయిదాకు సవరణలు చేసి ఎస్కేఎం తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఎస్కేఎం పంపిన సవరణలు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం, గురువారం లిఖితపూర్వక హామీ పత్రాన్ని ఎస్‌కేఎంకు పంపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సింఘూ సరిహద్దు వద్ద ఎస్కేఎం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్రనేతలంతా పాల్గొన్నారు. హన్నన్ మొల్లా, రాకేష్ టికాయిత్, దర్శన్ పాల్, బల్బీర్ సింగ్ రాజేవాలా, యోగేంద్ర యాదవ్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', గుర్నామ్ సింగ్ చారుని, ఉగ్రహాన్ తదితర నేతలు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజరు అగర్వాల్ పంపిన లిఖితపూర్వక హామీ పత్రంపై చర్చించారు. అన్ని సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. సుదీర్ఘ చర్చ తరువాత శనివారం తమ ఉద్యమాన్ని ఆపేస్తున్నట్టు ఎస్కేఎం ప్రతినిధులు తెలిపారు. జాతీయ రహదారుల దిగ్బంధాన్ని ఎత్తివేసి, ఇళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు. 'ఇతర అనేక ప్రాంతాల్లోనూ, టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న ఆందోళలను నిలిపివేస్తున్నాం. రైతుల హక్కులను నిర్ధారించే పోరాటం విజయవంతం అయింది. రైతులందరికీ చట్టపరమైన హక్కుగా కనీస మద్దతు ధరను పొందడానికి పోరాటం కొనసాగుతుంది' అని ఎస్కేఎం స్పష్టం చేసింది.
'అద్భుతమైన, చారిత్రాత్మకమైన ఈ పోరాట విజయాన్ని లఖింపూర్ ఖేరీతో సహా సుమారు 715 మంది ఉద్యమ అమరవీరులకు ఎస్కేఎం అంకితం చేస్తుంది. అపూర్వమైన పోరాటం చేసినందుకు రైతులు,పౌరులందరికీ ఎస్కేఎం హృదయపూర్వక అభినందనలు తెలుపుతుంది''అని పేర్కొం ది.''రైతుల ఐక్యత, శాంతి,సహనం విజయానికి కీలకం. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ చెరిపివేయబోమని, రైతులతో ప్రతిజ్ఞ బూనింది. సమిష్టిగా అప్రమత్తంగా ఉండాలనీ, హామీలు నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంది'' అని తెలిపింది. 'సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, అతని సహచరుల మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తున్నందున, ఎస్కేఎం రైతుల విజయానికి సంబంధించి అన్ని వేడుకలను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. రేపు (డిసెంబర్ 11) రైతులు వెళ్లిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తారు. దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమ శిబిరాలన్నీ కలిసి విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తాం'' అని తెలిపింది.
'కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని నిర్ధారించడానికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడా నికి ఎస్కేఎం తన తదుపరి సమావేశాన్ని జనవరి 15న ఢిల్లీలో నిర్వహించనున్నది' అని ఎస్కేఎం తెలిపింది. ''సుదీర్ఘ పోరాటానికి మద్దతు ఇచ్చిన దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమ శిబిరాలు ఉన్న ప్రాంతాల స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు.వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం.ఈ ఆందోళనలో రైతులతో పాటు పోరాడిన వ్యవసాయ కార్మిక,కార్మిక,మహిళ,విద్యార్థి,యువజన సంఘా లకు ధన్యవాదాలు. న్యాయ సహాయం అందించిన న్యాయవాదులకు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అలుపెరగని సేవలందిస్తున్న వైద్యులకు, లంగర్లు ఏర్పాటుచేసి రైతులకు నిరాటంకంగా ఆహారం అందించిన వివిధ సంస్థలకు, మానవ హక్కుల సంఘాలతో పాటు అనేక అభ్యుదయ సంఘాలకు, మద్దతుగా నిలిచిన అనేక మంది కళాకారులకు ధన్యవాదాలు' అని తెలిపింది.
హామీలు నెరవేరకపోతే మళ్లీ ఉద్యమం
ఎస్కేఎం సమావేశం అనంతరం రైతు నేత గుర్నామ్ సింగ్ చరుని మాట్లాడుతూ శనివారం ఉదయం 9 గంటలకు సింఘూ, టిక్రీ నిరసన స్థలాల వద్ద విజయోత్సవ కవాతును కూడా నిర్వహించనున్నట్టు ఎస్కేఎం నేతలు తెలిపారు. 'కేంద్రం తమ డిమాండ్లను ఆచరణలో పెట్టకపోతే ఆందోళన మళ్లీ చేపడతాం' అని స్పష్టం చేశారు. రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ ''పెద్ద విజయంతో దూసుకెళ్తున్నాం. అదే సమయంలో ఈ ఉద్యమం ఆగలేదు.. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కొనసాగిస్తాం' అన్నారు. అశోక్ ధావలే మాట్లాడుతూ ''దేశవ్యాప్తంగా ఎస్కేఎం కొనసాగుతుంది. మరింత బలోపేతం చేస్తాం'' అని స్పష్టం చేశారు.
దేశ రైతాంగానికి ఏఐకేఎస్ అభినందనలు
ఏడాది సుదీర్ఘ పోరాటం తర్వాత చారిత్రాత్మక విజయం సాధించినందుకు దేశంలోని రైతులకు ఏఐకేఎస్ అభినందనలు తెలిపింది. రైతుల ఉద్యమ ఒత్తిడితో ప్రభుత్వం దిగొచ్చిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కూర్చున్న రైతుల ఉద్యమ ఒత్తడితోనే రైతు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మూడు చట్టాలను రద్దు చేసినప్పటికీ కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం మౌనంగా ఉందని, కానీ రైతాంగం మాత్రం వెనక్కి తగ్గలేదని అన్నారు. దీంతో ఇప్పుడు అనేక వ్రాతపూర్వక చర్చల తర్వాత చివరకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను అంగీకరించిందని తెలిపారు. ఎస్కేఎం పోరాటంలో విజయం సాధించిందని, 378 రోజుల ఆందోళన తర్వాత ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
నోబెల్ శాంతి బహుమతికి ఎస్‌కెఎం సిఫార్సు
ప్రపంచంలోని అత్యంత శాంతియుత, ప్రజాస్వామ్య రైతు ఉద్యమాన్ని నడిపిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు. మాజీ ఐఎఎస్ అధికారులు ఈ మేరకు ఎస్కెేఎంను నోబెల్ శాంతి బహుమతికి గురువారం సిఫార్సు చేశారు. శాంతియు త కిసాన్ ''ఆందోళన'' విజయం,అద్వితీయ రైతు ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఏడాది క్రితం పంజాబ్ రైతులు ర్యాలీ చేసి, శంభు సరిహద్దులో తోటి హర్యానా రైతులతో కలిసి బారికేడ్లు దాటి, మైళ్లకు మైళ్లకు పాదయాత్ర చేసినప్పుడు, ఈ ఉద్యమం ప్రపంచంలోనే చరిత్ర సృష్టిస్తుందని ఎవరికీ తెలియదు. అన్ని అసమానతల కు వ్యతిరేకంగా రైతులు మొండితనం, క్రమశిక్షణ సంబంధి త అందరికీ కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఆందోళన విజయవంతమవడంతో విజయయాత్రపై చర్చించేందుకు ఫోరం పోషకులు స్వరణ్‌సింగ్ బొప్పరారు, రమేశిందర్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం కోర్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఒక పెద్ద ఉమ్మడి కారణం కోసం సామాన్యుల మధ్య ఐక్యత,ఈ ఉద్యమం ప్రక్రియ, విజయాలు చాలా కాలం పాటు పరిశోధించబడతాయని పేర్కొన్నారు. ఫోరమ్‌లోని సభ్యులందరి మనోభావాలను వ్యక్తం చేస్తూ దేశంలోని 50శాతానికి పైగా శ్రామిక రైతుల భవిష్యత్తును రక్షించడంలో విశిష్ట పాత్ర పోషించినందుకు సంయుక్త కిసాన్ మోర్చాకు నోబెల్ శాంతి బహుమతిని కోర్ కమిటీ ఈరోజు సిఫార్సు చేసింది. సమావేశానికి హాజరైన వారిలో పిఎస్ సాహి,ధన్బీర్ సింగ్ బైన్స్, జికె సింగ్, హర్కేష్ సింగ్ సిద్ధూ,పిర్తీ చంద్, సర్బ్జిత్ ధలివాల్ ఉన్నారు.