Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ అల్లర్లలో మోడీకి క్లీన్ చిట్ కేసుపై...
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లలో మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వుచేసింది. 2002లో చోటుచేసుకున్న ఈ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందనీ, ఇందులో పోలీసుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ పాలుపంచుకున్నారని పేర్కొంటూ.. అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ సహా 64 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సిట్ వారికి క్లిన్ చిట్ ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే, తన తీర్పును వెల్లడించకుండా రిజర్వు చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2002 ఫిబ్రవరి 28న అల్లర్లతో హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో దాదాపు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ అల్లర్లలో చనిపోయిన వారిలో ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అల్లర్లలో పెద్ద రాజకీయ కుట్ర దాగివుందనీ, రాజకీయ నాయకులతో పాటు పోలీసుల హస్తం ఇందులో ఉందని జాకియా తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసు విచారణ సమయంలోనే పలువురు నిందితులతో ప్రత్యేక దర్యాప్తు బృందంతో సంబంధం కలిగివుందని వాదనలు వినిపించారు. సిట్ కీలకమైన ఆధారాలను పట్టించుకోలేదనీ, సరైన దర్యాప్తు లేకుండా దీనిని మూసివేసే నివేదికలు దాఖలు చేసిందని ఆరోపించారు. ఈ అంశంపై విచారణ జరిపించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు.