Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దెబ్బతీశారు
- పాలకులకు వ్యతిరేకంగా రాస్తే అరెస్టులు, వేధింపులు : జర్నలిస్ట్ సంఘాలు ఎన్ఏజే, డీయూజే
- పార్లమెంట్ ఉభయ సభల నాయకులకు లేఖ
- సమస్యల పరిష్కారంపై నిపుణులతో ఒక మీడియా కమిషన్ వేయండి..
న్యూఢిల్లీ : పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు రోడ్డునపడుతున్నారని, కొత్తగా వచ్చిన లేబర్‌కోడ్‌లతో ఉద్యోగ భద్రత దెబ్బతిన్నదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటు పాలకుల వైపు నుంచి, అటు బడా కార్పొరేట్ల చేతుల్లోని మీడియా సంస్థల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని లేఖలో జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. ఈమేరకు 'ద నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్'(ఎన్ఏజే), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(డీయూజే) పార్లమెంట్ ఉభయ సభల్లోని నాయకులకు బహిరంగ లేఖ రాశాయి. నేడు పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిపుణులతో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటుచేయాలని లేఖలో కోరాయి. ఇందులో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.పత్రికా స్వేచ్ఛ దెబ్బతినటంతో జర్నలిస్టుల పని పరిస్థితులు దయనీయంగా మారాయి. ఉద్యోగాల్లో భద్రత పోయింది. పాలకులకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తే బెదిరింపులు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రముఖ వార్తా ఏజెన్సీలైన పీటీఐ, యూఎన్ఐలను బలహీనపర్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. దూరదర్శన్, రాజ్యసభ టీవీలు కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతున్నాయి. ఆర్థికంగా ఒత్తిడి తేవటం, లేఆఫ్‌లు ప్రకటించటం ద్వారా వీటిని నియంత్రించారు. మొత్తంగా జర్నలిస్టుల పని పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవటంతో పత్రికల్లో పనిచేసేవారెంతో మంది రోడ్డున పడుతున్నారు. వార్తా పత్రికల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత, ప్రయోజనాల్ని కల్పించే చట్టాల్ని కేంద్రం రద్దుచేసింది. 180 దేశాలకు విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్‌కు 142వ ర్యాంక్ వచ్చింది. లాక్డౌన్ సమయంలో సుమారుగా 3వేల మంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో దేశంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించడానికి 'జాతీయ మీడియా కమిషన్'ను ఏర్పాటుచేయాలి. వివాదాస్పద కార్మిక చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని లేఖలో జర్నలిస్టు సంఘాలు కోరాయి.