Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా నాగరికతా విలువల్లోనే ఈ స్ఫూర్తి వుందన్న మోడీ
న్యూఢిల్లీ : సోషల్ మీడియా, క్రిప్టో కరెన్సీ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతలకు అంతర్జాతీయంగా నిబంధనలను రూపొందించేందుకు ఐక్య కృషి జరగాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి అవి ఉపయోగపడాలి తప్ప దెబ్బతీయడానికి కాదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'ప్రజాస్వామ్య సదస్సు' పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో మోడీ మాట్లాడుతూ, స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలను నిర్వహించడంలో, పాలనకు సంబంధించిన అన్ని రంగాల్లో పారదర్శకతను పెంపొందించడంలో తమ అనుభవాలను, నైపుణ్యాలను పంచుకోవడం భారత్కు సంతోషకరమైన అంశమని అన్నారు.
ప్రజాస్వామ్యంపై అబ్రహం లింకన్ ప్రఖ్యాతి చెందిన కోట్ను మోడీ ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రజాస్వామ్యమనేది 'ప్రజలతో, ప్రజల్లో వుండాలని' అన్నారు. బహుళ పార్టీల ఎన్నికలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛా మీడియా వంటి వ్యవస్థాగత అంశాలు ప్రజాస్వామ్యానికి కీలకమైన సాధనాలని మోడీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం మౌలిక బలమనేది మన పౌరులు, మన సమాజాలు అందించే స్ఫూర్తి, పాటించే నైతిక విలువలపై ఆధారపడి వుంటుందని అన్నారు. ''ప్రజాస్వామ్యమనేది ప్రజల కొరకు, ప్రజల చేత మాత్రమే కాదు, ప్రజలతో, ప్రజల్లో వుండాల్సిందని'' మోడీ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది భారతదేశ నాగరికతా విలువల్లోనే అంతర్భాగంగా వుందని, శతాబ్దాల తరబడి వలస పాలన సాగినా భారతీయుల ప్రజాస్వామ్యస్ఫూర్తిని అణచివేయలేకపోయారని మోడీ వ్యాఖ్యానించారు. భారతదేశ స్వాతంత్య్రంలో పూర్తి స్థాయిలో ఈ ప్రజాస్వామ్యమనే భావన స్పష్టంగా ప్రకటితమైందని అన్నారు.