Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రహదారుల వెంబడి ఎక్కడా మాంసాహారం అమ్మరాదు ..అంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టు తప్పుబట్టింది. ప్రజలు ఏం తినాలో ..తినకూడదో నిర్ణయించడానికి మీరెవరు? అంటూ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో రోడ్ల వెంబడి, పాఠశాలలు, కాలేజీలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఎక్కడా మాంసాహారం అమ్మరాదు, నాన్-వెజ్ స్టాల్స్ పెట్టరాదు..అంటూ నెలరోజుల క్రితం అహ్మదాబాద్ మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ కమిటీ దాడులు జరిపింది. వంట పరికరాల్ని, వస్తువుల్ని స్వాధీనం చేసుకోవటమేగాక, మాంసాహారాన్ని బయటపడేసింది. రహదార్ల వెంబడి హోటల్స్, స్టాల్స్ నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారిపట్ల మున్సిపల్ అధికారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. దీనిని సవాల్ చేస్తూ హోటల్స్, స్టాల్స్ నిర్వాహకులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపాల్టీ అధికారులు తమ హోటల్స్, స్టాల్స్‌పై దాడులు చేశారని, అక్కడున్న మాంసాహారాన్ని బయటపడేశారని కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీరేన్ వైష్ణవ్ మున్సిపాల్టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మాంసాహారం తినకుండా ఆపలేరని, వారి ఆహార అభిరుచుల్ని అడ్డుకోలేరని అన్నారు. ''ప్రజలు మాంసాహారం తింటే మీకేంటి సమస్య? మీరు తినకపోతే..అది మీ దృక్పథం. నేనేం తినాలో మీరెలా నిర్ణయిస్తారు? మధుమేహం వస్తుందని చెరుకురసం తాగొద్దంటారా? ఆరోగ్యానికి మంచిది కాదని కాఫీ వద్దంటారా?'' అని మున్సిపాల్టీ అధికారుల్ని న్యాయమూర్తి బీరేన్ వైష్ణవ్ ప్రశ్నించారు. రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లు ఆక్రమించారని, రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారని, ఈనేపథ్యంలోనే అధికారులు దాడులు జరిపారని తన చర్యల్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమర్థించుకుంది.ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల్ని తొలగించటమనే పేరుతో..కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించాదని, నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న వంట వస్తువులు, పరికరాల్ని వారికి ఇచ్చేయాలని, పిటిషన్లో వారు పేర్కొన్న సమస్యల్ని పరిష్కరించాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.