Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్, సీపీఐ (ఎం), సీపీఐ సంతాపం
- హోం మంత్రి మహమూద్ అలీ నివాళి
- తీరనిలోటు : ఆవాజ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ ఉర్దూ దినపత్రిక 'రెహెనుమా- ఎ-దక్కన్' ప్రధాన సంపా దకులు, ఇండో అరబ్ లీగ్ చైర్మెన్ సయ్యద్ వికారుద్దీన్ (82) గుర వారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన... పరిస్థితి విషమిం చటంతో మరణించారు. శుక్రవారం మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థ నల అనంతరం హుస్సేనీ ఆలంలో వికారుద్దీన్ భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించారు.
అవివాహితుడైన వికారుద్దీన్ వందేండ్ల క్రితం నిజాం సంస్థానంలో ప్రారంభించిన 'రెహెనుమా-ఎ-దక్కన్...' పత్రికకు దశాబ్దాల నుంచి చీఫ్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. ఆయన చివరిదాకా విలువలతో కూడిన పాత్రికేయుడిగా జీవించారు. లౌకికవాదానికి పెద్ద పీట వేసిన వికారుద్దీన్ తాను నమ్మిన సిద్ధాంతాలతో పత్రికను నడిపారు. పాలస్తీనా విముక్తి పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని సమీకరించి పోరాడారు. ఆ విముక్తి పోరాట యోధుడు యాసర్ అరాఫత్‌ను అనేకసార్లు హైదరాబాద్‌కు ఆహ్వానించి, పెద్ద పెద్ద సభలను నిర్వహించారు. వామపక్షాలకు, ప్రజాస్వామ్య పార్టీలకు ఆయన అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.
వికారుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన వికారుద్దీన్ మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. ఆయన జీవితాంతం లౌకిక విలువలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు పత్రికను స్థాపించి కృషి చేశారని వివరించారు. ఇండో అరబ్ లీగ్ సంస్థను ఏర్పాటు చేసి భారత్-అరబ్ దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలను నెరిపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. పాలస్తీనా ప్రజలు స్వేచ్ఛగా జీవిచేందుకు వీలుగా ప్రజాస్వామిక శక్తులకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వికారుద్దీన్ మరణం పట్ల సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. హోం మంత్రి మహమూద్ అలీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్డీ అబ్బాస్ తదితరులు వికారుద్దీన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల వారు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత వి.హన్మంతరావు, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, టీయూడబ్ల్యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరాహత్ అలీ, నగునూరి శేఖర్ తదితరులు వికారుద్దీన్ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు, అభ్యుదయవాదులకు తీరని లోటని ఆవాజ్ రాష్ట్ర కమిటీ తన సంతాప ప్రకటనలో పేర్కొంది.