Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులు పారిపోవడానికి ప్రయత్నించలేదు
- నాగాలాండ్ కాల్పుల ఘటనపై బీజేపీ మిత్రపక్షం ఎన్పీపీ ఆరోపణలు
షిల్లాంగ్ : నాగాలాండ్ కాల్పుల ఘటనపై బీజేపీ మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వాస్తవాలను వక్రీకరించారని ఆరోపించింది. సైనికుల కాల్పుల్లో మరణించిన బాధితులు పారిపోవడానికి ప్రయత్నించలేదని వివరించింది. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో బొగ్గు గని కార్మికులతో వెళ్తున్న వాహనంపై భద్రతా దళాలు కాల్పులు జరిపిన ఘటనలో దాదాపు 17 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. ఘటన తర్వాత అమిత్ షా దీనిపై లోక్‌సభలో ప్రకటన కూడా చేశారు. వాహనంలో వెళ్తున్నవారిని భద్రతా బలగాలు తిరుగుబాటుదారులుగా భావించాయనీ, వారు వాహనం ఆపకుండా పారిపోవడంతో కాల్పులు చోటు చేసుకున్నాయని షా వివరించిన విషయం విదితమే. అయితే, దీనిపై ఎన్పీపీ మీడియా సెల్ జనరల్ సెక్రెటరీ తొహోవీ అచూమీ మాట్లాడుతూ.. కాల్పులు జరిగిన ప్రాంతంలో అసలు సెక్యూరిటీ చెక్‌పోస్ట్ పాయింట్ లేదని తెలిపారు. ''మేం అమిత్ షా ప్రకటనన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వాస్తవాలను వక్రీకరించారు'' అని చెప్పారు. ఒటింగ్ వద్ద రోడ్లు ఏమాత్రమూ బాగుండవనీ, గంటకు పది కిలోమీటర్ల వేగంకు మించి వాహనాలు వెళ్లలేవని ఆయన తెలిపారు. '' అక్కడ నుంచి ఏ ఒక్క వాహనమూ తప్పించుకోలేదు. వాహనం విండ్‌షీల్డ్‌లో బుల్లెట్ రంధ్రాలున్నాయి. అలాంటప్పుడు ఎవరైన పారిపోతుంటే ముందు నుంచి వచ్చి కాల్చి చంపడం ఎలా సాధ్యమవుతుంది?'' అని ఆయన ప్రశ్నించారు.