Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ మానవహక్కుల దినోత్సవ సభలో జస్టిస్ చంద్రు
అమరావతి : ప్రజా చైతన్యంతోనే మానవహక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని జస్టిస్ చంద్రు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్ఎ), ఏపీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) సంయుక్తంగా విజయవాడ ఎంబి విజ్ఞానకేంద్రంలో శుక్రవారం ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన వాస్తవ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొంది ఘన విజయం సాధించిన జైబీమ్ సినిమాను ప్రస్తావించారు. 'ఆ సినిమా చూసిన వారు చివరకు న్యాయం విజయం సాధించిందంటున్నారు. అది పూర్తి నిజం కాదు. పీడిత ప్రజలు సంఘటితమై సంఘంగా ఏర్పడటమే గెలుపునకు అసలు కారణం. ఆ సినిమాలో అదే చూపారు' అని అన్నారు. దీనితో పాటు అణగారిన ప్రజలు విద్యావంతులు కావడం కూడా ఎంతో కీలకమని చెప్పారు. 'చదువు.. సమీకరించు.. పోరాడు' అన్న అంబేద్కర్ నినాదాన్ని గుర్తుచేశారు. ప్రజలను విద్యావంతులుగా చేసి, వారిని చైతన్య పరిచే కృషికి హక్కుల పరిరక్షణ ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఈ దిశలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, అదే సమయంలో ఎన్నో పరిమితులు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ పరిమితుల్లోనే బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుందని, దీని కోసం న్యాయమూర్తులు మనస్సాక్షితోనూ, న్యాయవాదులు ధైర్యంగానూ వ్యవహరించాలని చెప్పారు. అంబేద్కర్ గ్రామాలు రెండుగా విడిపోయి ఉంటాయని చెప్పారని, నిజానికి అగ్రకులస్తులు, దళితులతో పాటు గిరిజన వాసాలుగా మూడుగా గ్రామాలు ఇప్పటికీ విడిపోయి ఉన్నాయని చెప్పారు. రాజ్యాంగానికి ఆ స్పృహ ఉందని, దళితులు, గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇటీవల కొందరు ఒకే దేశం, ఒకే భాష, ఒకే తిండి అంటూ మాట్లాడుతున్నారని, అయితే, అది నిజం కాదని, మన దేశంలో భిన్న పార్శ్వాలు ఉన్నాయని, అసమానతలు ఉన్నాయని చెప్పారు. వీటిని గుర్తించకుండా న్యాయం చేయడం సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. నమ్మకాన్ని ఆధారం చేసుకుని తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు, లాకప్‌లో చిత్రహింసల వంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు న్యాయమూర్తులు మనస్సాక్షితో ధృడంగా వ్యవహరించాలని అన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 న్యాయమూర్తులకు ఇటువంటి అధికారాలను ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా అనేక కేసులకు ఆయన ఉదహరించారు. జైబీమ్ సినిమాలో చూపిన కేసును విచారించి తీర్పు చెప్పిన జస్టిస్ పిఎస్ మిశ్రాను ఆయన గుర్తుచేసు కున్నారు. ఆ తరువాత కూడా పిఎస్ మిశ్రా ఇటువంటి తీర్పులను ఎన్నో చెప్పారని తెలిపారు. బాధితులకు న్యాయసాధనకు కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయ వాదులు పరికరాలుగా మాత్రమే ఉపయోగపడ తారని, అన్యాయాన్ని ప్రశ్నించే చైతన్యవంతమైన ప్రజాసమూహమే కీలకమని అన్నారు.
విచారించే అవకాశం కోల్పోయారు : మూడు రాజధానులపై చంద్రు
మూడు రాజధానులపై రాష్ట్ర హైకోర్టులో జరిగిన విచారణనను ఈ సందర్భంగా జస్టిస్ చంద్రు ప్రస్తావించారు. డివిజన్ బెంచ్‌లోని కొందరు న్యాయమూర్తులపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం, వారిని తప్పుకోవాలని కోరడం తదితర అంశాలను వివరించిన ఆయన ప్రభుత్వం అలా కోరడం అసాధారణమే కాని, అలా కోరే హక్కు ఉందని చెప్పారు. న్యాయమూర్తులు దీనికి తిరస్క రించడంతో రాష్ట్ర ప్రభుత్వంమూడు రాజధానుల బిల్లును రద్దు చేసిందని, తమకు అభ్యంతరం ఉన్న న్యాయమూర్తులు రిటైర్ అయిన తరువాతో, బదిలీ అయిన తరువాతో మళ్లీ బిల్లు తీసుకువచ్చే అవకాశంఉందని అన్నారు. న్యాయమూర్తులు వ్యవహరించిన తీరు వల్ల విచారణ చేసే అవకాశాన్ని కోల్పోయారని, మరోవైపు ప్రభుత్వానికే ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సామాన్య ప్రజల సంగతేమిటని ప్రశ్నించారు. అమరావతి భూ కుంభకోణం, సోషల్ మీడియాలో పోస్టుల వంటివాటిపట్ల హైకోర్టు స్పందించిన తీరును ఆయన ప్రస్తావించారు.
ఐలూ కృష్ణాజిల్లా కమిటీ నాయకులు సంపర శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు సమాజానికి న్యాయం చేయగలుగుతారని, చంద్రు దాన్ని నిరూపించారని తెలిపారు. కెేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత,గిరిజనులపై నేటికీ వివక్ష కొనసాగుతోందని అన్నారు. ఇటువంటి అసమానతలపై మరిన్ని పోరాటాలు చేయాల్సిఉందన్నారు. ఏపీసీఎల్ఎ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొత్తూరి సురేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్‌ను పునర్నిర్మించడానికి రిట్‌పిటిషన్లు, కోర్టు ధిక్కారం కేసులు, ఎన్నో పిల్లు వేస్తేగాని ప్రస్తుతం కర్నూలులో ఓ గెస్ట్ హౌస్‌లో మానవహక్కుల కమిషన్ పనిచేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం ఎపిలోని హెచ్ఆర్సికి ఫోన్‌నంబర్, ఈమెయిల్, ఫ్యాక్స్ నంబర్లు లేవని, వాటికోసం పోరాడతానని తెలిపారు. ఐలూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ప్రాథమికహక్కులు, కీలకమైన చట్టాలు అమలుకావడంలేదని వాటిపై బాధ్యతగల లాయర్లు పోరాటాలు చేయాలని కోరారు. అడ్వొకేట్ వై నాగిరెడ్డి మాట్లాడుతూ తాము విద్యార్థి దశలో ఉండగా యూనివర్శిటీలో జరిగిన అన్యాయాలపై ఎన్నో పోరాటాలు చేశామని, అటువంటివి ప్రస్తుతం జరుగకుండా బాధ్యతాయుతంగా తనవంతు కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమం అనంతరం చంద్రుని కొంతమంది లాయర్లు తమకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమానికి పొత్తూరి సురేష్‌కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విజయవాడ, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పలువురు అడ్వొకేట్లు పాల్గొన్నారు.