Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో విజయోత్సవ ప్రదర్శనలు
- టెంట్లు, గుడారాలు, వేదికలు తొలగింపు
- తీవ్ర ఉద్వేగానికి లోనవుతున్న రైతులు
- జీవితకాల స్నేహాన్ని ఇచ్చిన ఉద్యమం
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా రైతాంగం చేసిన పోరాటం, నేడు (శనివారం) విజరు దివస్ జరుపుకోవడంతో ముగియనుంది. సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో విజయోత్సవ ప్రదర్శనలు జరగనున్నాయి. అందుకోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఏర్పాట్లు చేసింది. మూడు రైతు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించినప్పటి నుంచి సరిహద్దుల్లో రైతులు పాటలతోనూ, నృత్యాలతోనూ మునిగ తేలారు. డప్పుల దరువులతో మహిళ రైతులు, యువకులు, వృద్ధ రైతులు నృత్యాలు చేశారు. ''జో బోలే సో నిహాల్ ... సస్రియా కాల్ '' అంటూ పెద్దగా స్వేచ్ఛగా గొంతెత్తుతున్నారు. నేటితో దేశ రాజధాని సరిహద్దుల దిగ్బంధనం ముగియడంతో రైతులు ఇండ్లకు బయలుదేరుతున్నారు. ఇప్పటీకే టెంట్లు, గుడారాలు, వేదికలను తొలగిస్తున్నారు. పదుల కిలో మీటర్లలో రైతులు ఉండటం చేత శివార్లులో ఉన్న రైతులు ఇప్పటికే ఇండ్లకి బయలు దేరారు. తన సామాగ్రి, దుస్తులున్న బ్యాగులు భుజానికి తగిలించుకొని ఇండ్లకు పయనమయ్యారు. ఏడాదికిపైగా తమతో ఉన్న జ్ఞాపకాలను వదిలి రైతులు ఇండ్లకు బయలుదేరుతున్నారు. తమకు సహకరించిన స్థానికి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సరిహద్దులకు వీడ్కోలు పలుకుతున్నారు. దీంతో అనేక మంది రైతులు తమ తీవ్ర ఉద్వేగానికి లోనవుతున్నారు.
గత ఏడాది కాలంగా తన నివాసంగా మారిన... తన తాత్కాలిక నివాసం నుంచి టార్పాలిన్‌ను తీసివేస్తూ, పాటియాలాకు చెందిన కుల్దీప్ సింగ్ (40) అనే రైతు ''ఈ స్థలాన్ని చాలా మిస్ అవుతాను. అయితే ఇంటికి తిరిగి వెళ్లడం సంతోషంగా ఉంది'' అని అన్నాడు. ''ఇన్ని ట్రక్కులు, ట్రాలీలు, జెండాలు కలిసి ఒకే చోట చూడాలని ఎవరు ఊహించగలరు. నేను దీన్ని ఎక్కువగా కోల్పోతాను'' అని అతను చెప్పాడు. ''నేను కలత చెందాను'' అని హర్యానాలోని కైతాల్‌కు చెందిన గాంధీ వీర్ భాన్ తన చిరునవ్వును దాచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తు చెప్పాడు. ''ఉచిత్ మే జమీన్ మిల్ గయీ థీ ఢిల్లీ మే. అబ్ ఛోడ్నీ పడేగీ (ఢిల్లీలో ఉండటానికి మాకు ఉచిత భూమి ఉంది. ఇప్పుడు మేము దానిని వదిలాల్సి ఉంటుంది)'' అని అతను తన తోటివారితో పాక్షికంగా కూల్చివేసిన షెల్టర్‌లో కూర్చుని నవ్వుతూ అన్నాడు. ''ఇది ఒక గొప్ప సంవత్సరం. బహుశా మా జీవితంలో మరపురానిది'' అని అతను చెప్పాడు. వేలాది మంది రైతులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన లైఫ్ కేర్ ఆస్పతిని రైతులు వెళ్లిన తరువాత మూసివేస్తామనీ, చాలా మంది అభిమానులతో తాము ఇక్కడ నుంచి వెళ్తామని అవతార్ సింగ్ తెలిపారు. జలంధర్‌లోని చోలాంగ్ గ్రామంలో లైఫ్ కేర్ హాస్పిటల్, జంగి కితాబ్ లైబ్రరీ స్మారక చిహ్నాలుగా నిర్మిస్తామని పేర్కొన్నారు. రైతులే కాదు, స్థానిక నివాసితులు కూడా ఆస్పత్రికి సాధారణ రోగులుగా మారారని ఆయన చెప్పారు. ''మేం నిరసన సమయంలో 700 మందికి పైగా రైతులను కోల్పోయాం. ఆస్పత్రి లేకపోతే మరణాల సంఖ్య భారీగా పెరిగేది'' అని అవతార్ సింగ్ తెలిపారు.
బర్నాలాకు చెందిన 55 ఏండ్ల జగ్దేవ్ సింగ్‌ను 20 ఏండ్ల తర్వాత మళ్లీ తన కెమెరాను పట్టుకునేలా ఈ ఉద్యమం చేసింది. జగదేవ్ నిరసన ప్రదేశంలో గంటల తరబడి సైకిల్‌పై తిరుగుతూ ఫోటోలను తీసి, ఆపై వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తన కథనాన్ని పంచుకుంటూ జగదేవ్ తాను పదేండ్ల పాటు వివాహ ఫోటోగ్రా ఫర్గా ఉన్నానని అన్నాడు. కాలి గాయం కావడంతో తాను ఫోటోగ్రఫీని విడిచిపెట్టినట్టు చెప్పారు. పూర్తి సమయం రైతు అయ్యాడు. '' ఏడాది కిందట.. నేను నిరసన కోసం వచ్చినప్పుడు, నేను మళ్ళీ నా కెమెరాను తీసుకున్నాను. నేను ఇప్పుడు ఆపివేస్తానని నేను అనుకోను'' అని అతను చెప్పాడు.
ఈ నిరసన చాలా మందికి జీవితకాల స్నేహాన్ని కూడా ఇచ్చింది. అనేక మంది ఒకరికి ఒకరు తెలియదు. ప్రాంతాలు వేరు, కులాలు వేరు కానీ ఉద్యమం చాలా మందిని స్నేహితులుగా చేసింది. సంగ్రూర్‌కు చెందిన జగ్తార్ సింగ్ (22), పాటియాలాకు చెందిన తన స్నేహితుడు జగ్మెహర్ సింగ్ (47)ని కౌగిలించుకుంటూ ఈ విధంగా అన్నాడు.''మేం ఇక్కడ జీవితకాల స్నేహితులం అయ్యాం. పాటియాలాలో నా కోసం ఒకరు ఉన్నారని నాకు తెలుసు. అతను నన్ను సంగ్రూర్‌లో ఉన్నానని అతనికి తెలుసు'' తెలిపారు. నిరసన ముగియడంతో సరిహద్దు శిబిరాల వద్ద వీధి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది పాటు సింఘు సరిహద్దులో తన స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్న రామ్‌వీర్ సింగ్, తాను, అతని కుటుంబం ఉద్యమ శిబిరాల్లోని అన్ని రకాల భోజనాలు తిన్నామని తెలిపారు. వ్యాపారం కూడా బాగా జరుగుతోందని చెప్పారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కిలో మీటర్ జంక్షన్‌కి తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నాడు.
షాజహాన్‌పూర్ సరిహద్దు వద్ద ముగింపు సభ
''కార్మిక, కర్షక ఐక్యతతోనే ఈ విజయం సాధించాం. ఐక్యతతోనే కార్పొరేట్లను ఓడించగలం. ఈ విజయం భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిగా ఉంటుంది. నేడు (శనివారం) దేశవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు'' అని ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ నేతలు హన్నన్ మొల్లా, బి.వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం షాహజన్ పూర్ సరిహద్దు వద్ద ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల చిహ్నానికి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు నివాళులర్పించారు. షాజహాన్ పూర్ సరిహద్దు వద్ద గత 13 నెలలుగా విరోచితంగా పోరాటం చేసిన రైతులకు, వారికి అండగా నిలిచిన వ్యవసాయ కార్మికుల, కార్మికులకు నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్నన్ మొల్లా, బి.వెంకట్ మాట్లాడుతూ షాజహాన్‌పూర్ ప్రాంతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేక సార్లు దాడులకు బరితెగించినప్పటికీ, వాటిని రైతులు ఐక్యంగా తిప్పికొట్టారని అన్నారు. కొన్నిసార్లు రైతులు వేసుకున్న టెంట్లను నేల కూర్చారని, భౌతిక దాడులకు వడిగట్టారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను ఛేదించి పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ఐక్యంగా పోరాడితే ఎంతటి నియంతలైన దిగిరాక తప్పదని ఈ పోరాటం రుజువు చేసిందని తెలిపారు. ఈ పోరాటం చాలా అసాధారణమైనదని, అలాగే ఈ పోరాటం ప్రపంచానికి అనుభవాలను నేర్పిందని అన్నారు. కార్మిక, కర్షక ఐక్యతను చాటిందని తెలిపారు. మోడీ లాంటి నియంతలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ఉపాధ్యక్షుడు అమ్రారామ్, కోశాధికారి కృష్ణ ప్రసాద్, ఏఐఏడబ్ల్యూయూ జాతీయ కార్యదర్శి విక్రమ్ సింగ్‌తో పాటు ఎఐకెఎస్ రాజస్థాన్ నాయకులు పేమా రామ్, ఛగన్ చౌదరి, సంజరు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
విజయోత్సవ సంబురాల్లో పాల్గొనండి
నేడు (శనివారం) ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతుల పోరాట చారిత్రాత్మక విజయోత్సవ సంబరాల్లో భాగస్వామ్యం కావాలని ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు ప్రజలకు పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు తపన్ సేన్ (సీఐటీయూ), హన్నన్ మొల్లా (ఏఐకేఎస్), బి వెంకట్ (ఏఐఏడబ్ల్యూయూ), మరియం ధావలే (ఐద్వా), అవరు ముఖర్జీ (డివైఎఫ్ఐ), మయూక్ బిస్వాస్ (ఎస్ఎఫ్ఐ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. రైతుల పోరాటం సాధించిన చారిత్రాత్మక విజయం మోడీ ప్రభుత్వాన్ని శాసించే కార్పొరేట్‌తో నడిచే నిరంకుశ, మతతత్వ శక్తులపై ప్రజాస్వామ్యం సాధించిన విజయాన్ని సూచిస్తుందని తెలిపారు. కార్పొరేట్, నయా ఉదారవాద శక్తులపై రైతాంగం, శ్రామిక వర్గం సాధించిన ఈ గొప్ప విజయం, దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఇది నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సమాజంలోని వివిధ వర్గాల పోరాటాలను కూడా బలపరుస్తుందని అన్నారు. ఈ విజయోత్సవాలను ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో రంగులు, బెలూన్లు, సంగీత వాయిద్యాలు, జెండాలు, రోడ్ షోలు, స్వీట్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు, మేధావులు, సాంస్కృతిక కార్యకర్తలు మొదలైన అన్ని వర్గాల ప్రజలు నేడు జరిగే వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.