Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీక్షా శిబిరంపై విరుచుకుపడిన పోలీసులు
- 350 మంది అరెస్టు...ఇద్దరు మహిళలకు గాయాలు
- సీఐటీయూ, సీపీఐ(ఎం) నేతల గృహనిర్బంధం
- టైం స్కేల్ వర్తింపజేసే వరకూ ఆందోళన కొనసాగుతుందని కార్మికుల ప్రకటన
తిరుపతి : తమకు టైం స్కేల్ వర్తింపజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఎఫ్ఎంఎస్) కార్మికులు గత 14 రోజులుగా చేస్త్తోన్న నిరవధిక దీక్షలపై పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున విరుచుకుపడ్డారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద దీక్షా శిబిరంలో నిద్రపోతున్న కార్మికులను, నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపైనా పోలీసులు తమ ప్రతాపం చూపడంతో ఇద్దరు మహిళా కార్మికులకు గాయా లయ్యాయి. ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న నాయకులను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలతో తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టులను అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. పలుచోట్ల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
టీటీడీలో గత 20 ఏండ్లుగా ఐదు వేల మంది ఎఫ్ఎంఎస్ కార్మికులు పని చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు కాకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వీరికి టైంస్కేల్ వర్తింపజేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గతంలో పాదయాత్ర సందర్భంగా, ఇటీవల వరద బాధితుల పరామర్శకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. రాతపూర్వకంగా హామీ ఇచ్చిన టిటిడి అధికారులు కూడా నాన్చుతూ వస్తు న్నారు. దీంతో, కార్మికులు దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగా నిరవధిక దీక్షలకు దిగారు. దీక్షా శిబిరం వద్దకు తెల్లవారకముందే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శిబిరంలో నిద్రపోతున్న సీఐటీయూ నగర నాయకులు టి.సుబ్రమణ్యం, ఆర్.లక్ష్మి, వేణు, సుజాత తదితరులతోపాటు 150 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద 144 సెక్షన్ విధిస్తూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకి ఎవరినీ రానీయకుండా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు మఫ్టీలో కాపలా ఉన్నారు. కార్మికుల పోరాటానికి నాయకత్వం వహిస్తోన్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సీపీఐ(ఎం) తిరుపతి ప్రాంత జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డివైఎఫ్ఐ, ఐద్వా జిల్లా కార్యదర్శులు ఎస్.జయచంద్ర, పి.సాయిలక్ష్మిలను గృహనిర్బంధం చేశారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలకు నిరసిస్తూ సీఐటీయూ కార్యాలయానికి ఎఫ్ఎంఎస్ కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి పరిపాలనా భవనం వద్దకు ర్యాలీగా బయల్దేరుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీిఐటీయూ నాయకులు జి.బాలసుబ్రమణ్యం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవ్, డీవైఎఫ్ఐ నాయకులు చినబాబు, ఎఫ్ఎంఎస్ కార్మిక నాయకులు గోపీల చొక్కాలను, మహిళల జుట్టు పట్టుకుని పోలీస్ వాహనాల్లో బలవంతంగా ఎక్కించారు. దీంతో, మహిళా కార్మికులు ఆర్.రమణమ్మ చేతికి, మధువేణి మోకాలికి గాయమై రక్తం కారింది. పలువురి కార్మికుల చొక్కాలు చిరిగాయి. అయినా, పోలీసులు పట్టించుకోకుండా సుమారు 200 మందిని రామచంద్రాపురం పోలీసు స్టేషన్కు తరలించారు. శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో, టిటిడి ఉసిగొల్పడం వల్లే పోలీసులు రెచ్చిపోయారని కార్మికులు విమర్శిస్తున్నారు. తమను అరెస్టు చేసి జైళ్లకు పంపినా, లాఠీలతో కుళ్లపొడిచినా టైం స్కేల్ ఇచ్చేవరకూ ఉద్యమాన్ని విరమించేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు. అరెస్టు చేసిన వారినీ పోలీసులు వివిధ స్టేషన్లలో ఉంచారు. రాత్రి వారిని విడుదల చేశారు.