Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి
న్యూఢిల్లీ : తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలైన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. అంత్యక్రియలకు ముందు శుక్రవారం ఉదయం బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ భౌతికకాయాలను ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని వారి అధికారిక నివాసంలో ఉంచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు వారికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర మొదలైంది. కామ్రాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు ఈ యాత్ర సాగింది. అంతిమయాత్రలో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. త్రివర్ణపతాకాలతో ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. బిపిన్ రావత్ అమర్ రహే అంటూ దారిపొడవునా నినాదాలు మారుమోగాయి. అధికారులు, ప్రముఖుల నివాళుల అనంతరం కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు జరిపారు. రావత్ దంపతులపై కప్పిన త్రివర్ణపతాకాన్ని వారి కుమార్తెలకు అందజేశారు.
అంతిమసంస్కారాలు నిర్వహించిన ఇద్దరు కూతుర్లు
సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. రావత్‌కు గౌరవసూచికంగా 17 గన్ సెల్యూట్ ను సమర్పించారు. సీడీఎస్ అంత్యక్రియల్లో దాదాపు 800 మంది సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లు హాజరై ఆయనకు నివాళులర్పించారు. వివిధ దేశాలకు చెందిన సైనిక అధికారులూ నివాళులర్పించినవారిలో ఉన్నారు. చివరగా రావత్, మధులికలకు ఆయన కూతుర్లు కృతిక, తరిణి లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు తుది నివాళులర్పించారు. అనంతరం వారి ఇద్దరు కూతుర్లు వారికి అంతిమ సంస్కారాలను నిర్వహించారు.