Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమిళనాడులో బుధవారం జరిగిన ఎంఐ-17వి5 హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఇద్దరు సైనికులు, నలుగురు భారత వాయుసేన (ఐఎఎఫ్) సిబ్బంది మృతదేహాలను గుర్తించి, అంత్య క్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రక్షణ రంగ అధికారులు శనివారం తెలిపారు. 'లాన్స్ నాయక్ బి.సాయి తేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అందజేశాం' అని ఆర్మీ అధికారులు తెలిపారు. మరో నలుగురు ఐఎఎఫ్ సిబ్బంది మృతదేహాలను కూడా గుర్తించినట్లు చెప్పారు. దీంతో, మరణించిన 13 మందిలో తొమ్మిదిమంది మృతదేహాలను గుర్తించినట్లయింది. మిగిలిన నలుగురి మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక చితాభస్మాన్ని శనివారం ఉదయం ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో గంగానదిలో కలిపారు. ఈ దంపతుల కుమార్తెలు కతిక, తరణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.