Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమాజ్‌పై హర్యానా సిఎం నిర్ణయాన్ని ఖండించిన సిపిఎం
న్యూఢిల్లీ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన అత్యంత అభ్యంతరకర ప్రకటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. పార్టీ పొలిట్‌బ్యూరో శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడాన్ని ఇక ఎంత మాత్రమూ సహించబోమని ఖట్టర్ శుక్రవారం పేర్కొన్నారు. అన్ని మతాల్లోను ప్రజలు ఇలా బహిరంగంగా గుమిగూడడమనేది సర్వసాధారణంగా జరుగుతున్నదే, అలాంటప్పుడు ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని పొలిట్ బ్యూరో పేర్కొంది. ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా తగినన్ని మసీదులు లేనందున బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించుకోవచ్చని గుర్గావ్ ముస్లింలకు తన సొంత ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన అనుమతిని సైతం ముఖ్యమంత్రి వెనక్కి తీసుకున్నారు.. గత కొన్ని మాసాలుగా, ప్రతి శుక్రవారం బజరంగ్దళ్ వంటి సంస్థలకు చెందిన మూకలు ముస్లింలను నిర్దేశిత ప్రదేశాల్ల్లో ప్రార్ధనలు జరుపుకోనీయకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు అక్కడే ఉండి ఈ దురన్యాయాన్ని సాగనిస్తున్నారు. దుండగులను శిక్షించి, ప్రార్థనలు నిరాటంకంగా జరిగేలా చూడాల్సిన ముఖ్యమంత్రి భారత పౌరుల్లో ఒక సెక్షన్‌కు ప్రాథమిక రాజ్యాంగ హక్కును నిరాకరిస్తున్నారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ముఖ్యమంత్రి తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా సాగేలా హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. మసీదుల నిర్మాణానికి, వక్ఫ్ ఆస్తులపై నియంత్రణ సాధించేందుకు ముస్లింలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరింది.
మైనారిటీల హక్కులను కాపాడాలి
గుర్గావ్లో మతోన్మాద ధోరణులు పెచ్చరిల్లే ప్రయత్నాలను ప్రభుత్వం బహిరంగంగానే ప్రోత్సహిస్తోందని సిపిఎం హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర సింగ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత మూడు మాసాలుగా గుర్గావ్లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రార్థనలను ఆటంకపరుస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు. మతం పేరుతో ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలను విరమించాలని, మైనారిటీల హక్కులను కాపాడాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని తెలిపారు.