Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం నేత తరిగామి ఆందోళన
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులచే మానవ హక్కులు కాలరాయబడుతున్నాయని సిపిఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హైదర్పొరాలో పౌరులు హత్యకు గురైన విషాద ఘటన, అక్టోబరులో పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన ఘటనలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ ఈ ప్రాంతంలో దాదాపు అన్నిచోట్లా ఏదో ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే వుందని తెలిపారు. యుఎపిఎ, ప్రజా భద్రతా చట్టం వంటి నిరంకుశ చట్టాల కింద ప్రజలను విచక్షణారహితంగా నిర్బంధిస్తున్నారని, దీంతో వారి మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 370వ అధికరణ కింద రాష్ట్రానికి గతంలో వున్న ప్రత్యేక హోదాను అప్రజాస్వామికంగా రద్దు చేయడంతో ఈ పరిస్థితి మరీ ఆందోళనకరంగా తయారైందన్నారు. సార్వత్రిక మానవ హక్కుల డిక్లరేషన్లోని 19వ అధికరణలో పేర్కొన్న ప్రాథమిక హక్కయిన భావ ప్రకటనా స్వేచ్ఛ నిరంతరంగా అణచివేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరంకుశ చట్టాలన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని తరిగామి డిమాండ్ చేశారు. ప్రజల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులకు మద్దతుగా పౌర సమాజం, రాజకీయ పార్టీలు, ఇతర సంబంధిత వర్గాలు సాగించే ఐక్య పోరాటం కొనసాగాలని కోరారు. మన ప్రజల గౌరవప్రదమైన జీవితం కోసం పోరు సాగించాలని మనం తీర్మానించాలని విజ్ఞప్తి చేశారు.