Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంతకుముందు కేటాయించిన ప్రదేశాల్నీ రద్దు చేస్తున్నాం..
- హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద ప్రకటన
- సీఎం ప్రకటనపై సీపీఐ(ఎం) ఆగ్రహం
- ప్రభుత్వమే మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణ
- తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు(నమాజ్) చేయటాన్ని అంగీకరించమని హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద ప్రకటన చేశారు. అంతేకాదు నమాజ్ కోసం గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రదేశాల్నీ కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించారు. గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీతో జరిగిన ఒక సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం ఖట్టర్ ఆదేశాలు జారీచేశారని వార్తా ఏజెన్సీ 'ఏఎన్ఐ' తెలిపింది. శుక్రవారం నాటి ఈ సమావేశానికి ముందు సీఎం ఖట్టర్ గురుగ్రామ్‌లోని హిందూత్వ గ్రూపులతో చర్చలు జరిపారని తెలిసింది. నగరంలో నిర్దేశిత ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్ చేపట్టడాన్ని కొన్ని హిందూత్వ గ్రూప్‌లు గత మూడు నెలలుగా అడ్డుకుంటున్నాయి. దాంతో ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ''ప్రతి ఒక్కరూ వారి వారి ప్రదేశాల్లోనే నమాజ్ చేస్తారు. పూజలు చేస్తారు. ఇలాంటి వారితో మాకేం సమస్యలేదు.మతపరమైన ప్రార్థనలు బహిరంగ ప్రదేశాల్లో జరగరాదు.అయితే ఇక్కడ నమాజ్ బహిరంగంగా చేస్తామంటు న్నారు. అది కుదరదు.ముస్లిం మతపెద్దలతో మాట్లాడాను. వక్ఫ్ బోర్డ్ కింద ఉన్న ప్రదేశాల్లో నమాజ్ చేసుకోవచ్చు. గురుగ్రామ్‌లో నమాజ్ కోసం గతంలో నిర్దేశించిన ప్రదేశాల్ని కూడా రద్దు చేస్తున్నాం. ఇదే విష యాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు తెలిపా''నని ఖట్టర్ అన్నారు. నవంబర్ 5న నగరంలో నమాజ్ కోసం నిర్దేశించిన ఓ స్థలం వద్దకు చేరుకున్న హిందూత్వ గ్రూపులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గోమూత్రాన్ని చల్లి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేశారు. నవంబర్ 7న ఇదే హిందూత్వ గ్రూపులు అక్కడికి చేరుకొని ముస్లింల నమాజ్‌ను అడ్డుకున్నారు.ఆ ప్రదేశంలో వాల్‌బాల్ ఆటస్థలాన్ని ఏర్పాటుచేస్తున్నా మని హిందూత్వ గ్రూపులు ప్రకటించాయి. గుర్‌గ్రామ్‌లో సెక్టార్ 37లో నమాజ్‌కు కేటాయించిన మరోక ప్రదేశంలో ముస్లింల నమాజ్‌ను హిందూత్వ గ్రూపులు అడ్డుకున్నాయి.నమాజ్ ఇక్కడ జరపరాదంటూ నవంబర్ 20న ఆందోళనకు దిగాయి.ఈ ప్రదేశాన్ని క్రికెట్ ఆట స్థలం కోసం వినియోగించుకుంటామని హిందూత్వ గ్రూపులు ప్రకటించాయి. అయితే ఈ వివాదం ప్రశాంతంగా పరిష్కారమైందని ఖట్టర్ చెబుతున్నారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలి : పొలిట్‌బ్యూరో
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ శుక్రవారం చేసిన తీవ్ర అభ్యంతరకర ప్రకటనను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇలా బహిరంగంగా గుమిగూడడమనేది సర్వసాధారణమేనని, ఇలాంటి ప్రకటన చేయడం ఆమోదయోగ్యం కాదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రార్ధనలు చేసుకోవడానికి వీలుగా తగినన్ని మసీదులు లేనందున బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించుకోవచ్చని గుర్గావ్ ముస్లింలకు తమ ప్రభుత్వం ఇచ్చిన అనుమతినే ముఖ్యమంత్రి ఉపసంహరించుకున్నారు. గత కొద్ది మాసాలుగా, ప్రతి శుక్రవారం బజరంగ్దళ్ వంటి సంస్థలకు చెందిన వ్యక్తులు ప్రార్ధనలు చేసుకోనివ్వకుండా ముస్లింలను అడ్డుకుంటున్నారు. పోలీసులు పక్కనే నిలబడి ఈ అన్యాయాన్ని జరగనిచ్చారు. ఆ దుండగులను శిక్షించి, ప్రార్ధనలు నిరాటంకంగా జరిగేలా చూడడానికి బదులుగా స్వయంగా ముఖ్యమంత్రే భారత పౌరుల్లో ఒక వర్గానికి చెందిన వారి రాజ్యాంగ మౌలిక హక్కును నిరాకరిస్తున్నారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. శుక్రవారం ప్రార్ధనలు శాంతియుతం గాసాగేలా హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. మసీదుల నిర్మాణానికి, వక్ఫ్ ఆస్తులపై నియంత్రణ సాధించేందుకు ముస్లింలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరింది.
మైనారిటీల హక్కులను కాపాడాలి
గుర్గావ్లో మతోన్మాద ధోరణులు పెచ్చరిల్లే ప్రయత్నాలను ప్రభుత్వం బహిరంగంగానే ప్రోత్సహిస్తోందని హర్యానా రాష్ట్ర సీపీఐ(ఎం) కార్యదర్శి సురేంద్ర సింగ్ ఒక ప్రకటనలో విమర్శించారు. గత మూడు మాసాలుగా గుర్గావ్లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రార్ధనలను ఆటంకపరుస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు. మతం పేరుతో ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలను విరమించాలని, మైనారిటీల హక్కులను కాపాడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోందని అన్నారు.