Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమానికి సీపీఐ(ఎం) అభినందనలు
న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాల రద్దు లక్ష్యంగా ఉద్యమించిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), వ్యవసాయ కార్మిక సంఘాలకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియజేసింది. రైతు సంఘాలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని ప్రశంసిం చింది. ఏడాదికాలంగా ఢిల్లీ శివార్లలో సుదీర్ఘంగా సాగిన ఉద్యమానికి రైతు సంఘాలు ముగింపు పలికిన నేపథ్యంలో పొలిట్‌బ్యూరో మీడి యాకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యమానికి అండగా నిలబడుతూ కార్మిక, ప్రజాస్వామ్య సంఘాలు మద్దతు తెలిపాయని పేర్కొన్నది. ప్రజా హక్కులపై పాలకుల దాడిని నిరసిస్తూ అందరూ ఒక్కటై పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో రైతు ఉద్యమం సాధించిన విజయం ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కులమతాలకు అతీతంగా పోరాడొచ్చు అని ఉద్యమం నిరూపించింది. ఉద్యమంలో ప్రాణాలర్పించిన 700మంది రైతులకు పొలిట్‌బ్యూరో సెల్యూట్ చేసింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని మోడీ సర్కార్‌ను డిమాండ్ చేసింది. ఉద్యమంలో రైతులపై పోలీసులు పెట్టిన కేసుల్ని రద్దు చేయాలని కోరింది.
విజయతీరాలకు చేర్చారు : కార్మికసంఘాలు
రైతు ఉద్యమానికి నేతృత్వం వహించి సరైన ముగింపునిచ్చారని 'సంయుక్త కిసాన్ మోర్చా'(ఎస్కేఎం)ను కేంద్ర కార్మిక సంఘాలు మనస్ఫూర్తిగా అభినందించాయి. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారని, ఢిల్లీ శివారు ప్రాంతంలో సాగుతున్న సుదీర్ఘ నిరసనపై ఎస్కేఎం సరైన నిర్ణయం తీసుకుందని కార్మిక సంఘాల సంయుక్త వేదిక సంతోషం వ్యక్తం చేసింది. ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఆనందాన్ని, విజయాన్ని కార్మికవర్గం పలువురితో పంచుకుంటోంది. ఉద్యమంలో రైతుల మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ప్రాణాలర్పించిన 715మంది రైతులు రాబోయే తరాలకు గట్టి సందేశాన్ని నిచ్చారు. కార్మికులు, రైతుల ఐక్యత ఉద్యమం సాధించిన అతిగొప్ప విజయమని, వెలగట్టలేనిదని కార్మికసంఘాలు అభిప్రాయపడ్డాయి.