Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో వక్తలు
న్యూఢిల్లీ : కల్పకం ఏచూరి గొప్ప సామాజిక కార్యకర్త అని పలువురు వక్తలు కొనియాడారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఏచూరి మరణించారు. శనివారం నాడిక్కడ స్థానిక కాన్సిస్టిట్యూషన్ క్లబ్ ఎనెక్స్‌లో కల్పకం ఏచూరి సంస్మరణ సభ జరిగింది. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాతో పాటు వివిధ ప్రముఖులు రాసిన సంతాప సందేశాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కల్పకం ఏచూరి సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నాయకురాలు కమల్ జిత్ కౌర్ మాట్లాడుతూ దేశంలోని మహిళా లోకానికి ఆమె ఎంతోసేవలు అందించారని గుర్తు చేశారు. మహిళలకు సాధికారత కల్పించే దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశారని వివరించారు. సామాజిక అంశాలపై అందరితో లోతుగా చర్చించేవారన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ కాకినాడ ప్రాంతంలో ఒక గ్రామాన్ని ఆమె దత్తత తీసుకొని గ్రామీణాభివృద్ధికి ఎంతోకృషి చేశారని తెలిపారు. స్థానిక మహిళలకు ఆయా రంగాల్లో శిక్షణ ఇప్పించారని అన్నారు. తొలుత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులను, సన్నిహితులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, హన్నన్ మొల్లా, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జెఎన్‌యు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, సిపిఎం నేతలు, మహిళ సంఘాల నేతలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.