Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమంతో విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గిన సర్కార్
న్యూఢిల్లీ : శీతాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే రైతులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ బిల్లు రాదని చెప్పాలి. వాస్తవానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించుకోవాలని ప్రభుత్వం యోచించింది. అందుకనుగుణంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుల జాబితాలో విద్యుత్ సవరణ బిల్లునూ ప్రభుత్వం పెట్టింది. అయితే పార్లమెంట్లో ప్రభుత్వం పెట్టేటట్టు కనబడటం లేదు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, విద్యుత్ సరవణ బిల్లు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో దేశంలోని రైతాంగం ఉద్యమించింది. ఏడాదికిపైగా సుదీర్ఘంగా చారిత్రాత్మక పోరాటం చేసిన రైతాంగానికి మోడీ సర్కార్ దిగొచ్చింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేందుకు సిద్ధపడింది. మూడు చట్టాలు రద్దు చేస్తామనీ, రైతులు ఇండ్లకు వెళ్లాలని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే రైతులు మాత్రం చట్టాలను రద్దు చేసే బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు కదలబోమని, అలాగే తమ మిగతా డిమాండ్ల మాటేమిటని ప్రశ్నించారు. నవంబర్ 29న మూడు రైతు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్లో ఆమోదించారు. అనంతరం ప్రధాని మోడీకి మిగిలిన ఆరు డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తరువాతే తాము స్పందిస్తామని ఎస్కేఎం పేర్కొంది. దీంతో రైతుల ముందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చింది. ఈ ప్రతిపాదనలకు ఎస్కేఎం కొన్ని సవరణలు చేసి, ప్రభుత్వానికి పంపింది. ఈ సవరణల్లో విద్యుత్ సవరణ బిల్లు అంశం కూడా ఉంది. చాలా చర్చలు తరువాత చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. విద్యుత్ సవరణ బిల్లును వాటాదారులతో సహా, ఎస్కేఎం నేతలతో చర్చించిన తరువాతనే పార్లమెంట్లో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం తప్పుకున్నట్టు కనబడుతుంది.