Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్‌లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివాదాస్పద చట్టం 'ఏఎఫ్ఎస్పీఏ' రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం చేసింది. సైనిక బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను రాష్ట్రంలో అమలుజేయకుండా తొలగిస్తామని మణిపూర్ కాంగ్రెస్ నాయకుడు మేఘాచంద్ర ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈచట్టాన్ని రద్దు చేయాలని సీఎం ఎన్.బీరేన్ సింగ్, ప్రధాని మోడీలను ఆయన డిమాండ్ చేశారు. చట్టం అమలుకాకుండా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కోరుతుండగా, ఈ జాబితాలోకి మణిపూర్ సీఎం ఎన్.బీరేన్‌సింగ్ కూడా చేరారు. ఈ చట్టం అమల్లో ఉన్న చోట సైనిక బలగాలు కాల్పలకు తెగబడినా, అరెస్టులకు పాల్పడినా..ఇదేమని అడిగే అవకాశం లేదు. సైనిక నేరాలపై మిలటరీ కోర్టులు సైతం విచారించలేవు. అంతటి అపరిమిత అధికారాల్ని ఏఎఫ్ఎస్పీఏ చట్టం సైన్యానికి కట్టబెడుతోంది. దేశంలో ఈ చట్టం ప్రస్తుతం నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లోని కొన్ని జిల్లాల్లో అమల్లో ఉంది. మేఘాలయలో 2018లో రద్దు చేశారు. నాగాలాండ్‌లో ఇటీవల జరిగిన సైనిక కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకొని సైన్యం కాల్పులకు దిగటమేంటని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రత్యేక చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ద్వారా సైనిక బలగాలకు కల్పించిన ప్రత్యేక అధికారాలే ఈ ఘటకు దారితీసిందని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు మండిపడుతున్నారు. ఏఎఫ్ఎస్పీఏ చట్టం రద్దు చేయాల్సిందేనని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. త్వరలో మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ చట్టం రద్దు ప్రధాన అంశంగా మారింది.