Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఏడేండ్ల పాలనలో దేశాన్ని భ్రష్టుపట్టించింది
- మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ, ప్రియాంకల విమర్శలు
న్యూఢిల్లీ: బీజేపీ ఏడేండ్ల పాలనలో దేశన్ని భ్రష్టుపట్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. నేడు దేశరాజకీయాల్లో హిందు, హిందూత్వవాది అనేవి రెండు వేరువేరు పదాలనీ, ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్రపోటీ ఉందని ఆయన అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలను నిరశిస్తూ.. కాంగ్రెస్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మెడీ సర్కారుపై, బీజేపీ 'హిందూత్వ' సిద్ధాంతంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూయిజానికి, హిందుత్వకు మధ్య తేడాను వివరిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూత్వవాదులు అధికారం వెనకాల పరిగెడుతారనీ, అధికారమే వారికి పరమావధి అని విమర్శించారు. హిందువులు మహాత్మా గాంధీలా సత్యాన్వేషణలో ఉంటారని... హిందూత్వవాదులకు సత్యంతో పనిలేదని అన్నారు. 'నేనొక హిందువుని.. ఇక్కడున్నవారంతా హిందువులు... కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు హిందూత్వవాదులు... తేడా ఏంటో నేను వివరిస్తాను... మహాత్మా గాంధీ ఒక హిందూవు... నాథురాంగాడ్సే హిందుత్వవాది.. హిందూత్వవాదులకు అధికారం తప్ప ఏమీ అవసరం లేదు.. అధికారం కోసం వారు ఏమైనా చేస్తారు.. కానీ హిందువులు మహాత్మాగాంధీలా సత్వాన్వేషణలో ఉంటారు' అని రాహుల్ గాంధీ అన్నారు.
అలాగే, పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ.. 'ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఫేక్ హిందువులు... కేంద్రంలో ఉన్నది హిందూరాజ్యం కాదు... హిందూత్వ రాజ్యం... ఈ హిందూత్వవాదులను అధికారం నుంచి తప్పించి మళ్లీ హిందూ రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలి' అని రాహుల్ అన్నారు. పెరుగతున్న నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ''నేడు దేశ జనాభాలో ఒక శాతం మంది చేతిలో 33 శాతం సంపద ఉంది. జనాభాలో 10 శాతం మంది చేతిలో 65 శాతం డబ్బు ఉంది. జనాభాలో 50 శాతం పేదల చేతిలో కేవలం 6 శాతం డబ్బు మాత్రమే ఉంద''ని తెలిపారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పౌరులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ సాధించినదాన్ని బీజేపీ తన స్నేహితులకు పంచిపెట్టిదని ఆరోపించారు. గత ఏడేండ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయాలని ప్రజలను కోరారు. ద్రవ్యోల్బణంపై పోరులో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,000, ఆవాల నూనె లీటరుకు రూ.200 చేరగా, పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయని అన్నారు. సామాన్య ప్రజల జీవితాలు కష్టంగా మారాయనీ, అయితే, వారి గోసను ప్రభుత్వం వినడంలేదని ఆరోపించారు. కాగా, జైపూర్‌లోని విద్యాధర్‌నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ఆదిర్ రంజన్ చౌదరి, భూపేష్ బఘేల్, మల్లికార్జున్ ఖర్గే, కుమారి సెల్జా వంటి ప్రముఖ నేతలందరూ పాల్గొన్నారు.