Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాల్లో 8.7శాతం.. తీవ్రరూపం దాల్చిన నిరుద్యోగం
- గ్రామాల్లో డిమాండ్‌కు మించి కార్మికుల సరఫరా
- ఉన్నత చదువులున్నా ఏం చేయలేకపోతున్నామని నిరాశ, నిస్పృహ
- దేశాన్ని నిండాముంచిన మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు
నిరుద్యోగ సమస్య దేశ యువతని తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నత చదువులు చదివినా జాబ్ మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఏది మాట్లాడినా పాలకులు కరోనా సంక్షోభాన్ని సాకుగా చూపుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకొని బతుకుదామన్నా..ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాల్లో డిమాండ్‌కు మించి కార్మికుల సరఫరా ఉంది. ఈనేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏమవుతున్నాయి? అనే ప్రశ్న యువత మదిని తొలిచివేస్తోంది!
న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం వ్యవసాయం. అయితే ఇది గ్రామాల్లో విస్తరించి ఉంది. ఉన్నత చదువులు చదువుకున్నవారు పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిందే. ఏదో ఒక ఉపాధి వెదుక్కోవాల్సిందే. అయితే గత మూడేండ్లుగా పట్టణాలు, నగరాల్లో ఉపాధి గణనీయంగా పడి పోతూ వస్తోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పట్టణ నిరుద్యోగం 8శాతం దాటడం ముఖ్య హెచ్చరిక. మొదటి లాక్ డౌన్ (ఏప్రిల్-మే 2020) సమయంలో నిరుద్యోగరేటు రికార్డు స్థాయిలో 25శాతానికి చేరుకుంది. కరోనా ప్రభావం తగ్గింద నుకునే సమయంలో మళ్లీ రెండో వేవ్ వచ్చింది. మే 2021లో నిరుద్యోగరేటు దాదాపు 15శాతం నమోదైంది. కరోనా నియం త్రణలు, ఆంక్షలు తొలగించాక నిరుద్యోగం తగ్గుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. సీఎంఐఈ తాజా గణాంకాల ప్రకారం పట్టణాల్లో నిరుద్యోగరేటు డిసెంబర్ 5 నాటికి 8.7శాతం వద్దకు చేరుకుంది. దేశ ఆర్థిక పరిస్థితికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. సరైన ఉపాధి లేక ఎన్నో కుటుంబాలు అప్పులు చేసుకుంటూ బతుకుతున్నాయి. దినసరి కూలిపని దొరికినా చేయడానికి యువత సిద్ధమవుతోంది.
గ్రామాల్లోనూ అదే పరిస్థితి
జనవరి 2019లో పట్టణాల్లో ఉపాధి పొందినవారి సంఖ్య 12.84కోట్లు. డిసెంబర్, 2021వచ్చే సరికి ఆ సంఖ్య 12.47 కోట్లకు తగ్గింది. దేశంలో ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న వారు, పనిచేసే వయస్సులో ఉన్నవారి సంఖ్య ఓ వైపు పెరుగు తుంటే వారికి ఉపాధి అవకాశాల్ని సృష్టించటం కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన ముఖ్య బాధ్యత. దేశవ్యాప్తంగా గ్రామాల్లోనూ ఉపాధి కలిగినవారి సంఖ్య గత మూడేండ్లలో తగ్గింది. 27.77 కోట్ల నుంచి 27.68కోట్లకు పడిపోయింది. ఆందోళన కలిగించే మరొక విషయం ఏమంటే, కార్మిక ప్రాతినిథ్యరేటు పడిపోతోంది. జనవరి 2019లో 41.5శాతముంటే, డిసెంబర్ 2021నాటికి 37.5శాతానికి తగ్గింది.
యువతను చుట్టుముట్టిన నిరాశ
నిరుద్యోగంపై సీఎంఐఈ విడుదల చేసిన తాజా గణాంకాలు దేశ ఆర్థికరంగం ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోంది. పలు రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం భవిష్యత్తుపై వారికి ఎలాంటి ఆశా లేకపోవటం, ఇక ముందు చిన్నపాటి ఉద్యోగం కూడా దొరకదనే నిరాశా, నిస్పృహలు. కేంద్రంలో మోడీ సర్కార్ అమలుజేస్తున్న ఆర్థిక విధానాల ఫలితమిది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించని నోట్లరద్దు, జీఎస్టీ, పన్ను సంస్కరణలు, ఆర్థిక, కార్మిక సంస్క రణలు ఎందుకు ? అని యవత ప్రశ్నిస్తోంది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక..పట్టణాలు, నగరాల్లో ఏదో ఒకటి దొరక్కపోతుందా?అని చదువుకున్న యువత ఎదురుచూడాల్సి వస్తోంది. పరిస్థితిని చక్కదిద్దడానికి విధానపరంగా కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. వివిధ రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభావం ఎదురైంది. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫిబ్రవరి-మార్చి 2022మధ్య ఉత్తరప్రదేశ్, పంజాబ్ మొదలైన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్ల తీర్పు రాబోతోందని విశ్వసనీయ సమాచారం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం కీలకమైన చర్యలేవీ చేపట్టడం లేదు. ఉపాధి సమస్య ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్, మేక్ ఇన్ ఇండియా..అంటూ చేసిన హడావిడి ప్రచార ఆర్భాటమని తేలిపోయింది.