Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వ విధానమేంటో తెలుసుకోవాలనుకుంటు న్నామని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో వుంచుకుంటే టీకా కొనుగోలు ఆర్డర్లు పెట్టడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ కేంద్రాల ఉత్పత్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాల్సి వుందని పేర్కొంది. రిటైర్ట్ ఐఏఎస్ అమూల్య రత్న నంద, ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్, లో కాస్ట్ స్టాండర్డ్ థెరప్యూటిక్స్ అండ్ మెడికో ఫ్రెంట్ సర్కిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ప్రభుత్వ స్పందన వెల్లడించాలని ఆదేశించింది. వ్యాక్సిన్ అవసరం ఎక్కువగా వున్న సమయంలో ముఖ్యంగా గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ-అవసరమైన ప్రామాణికాలు పాటించడం) కోసం ఈ సంస్థలపై ప్రజా నిధులన్నీ ఖర్చు చేసిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించడానికి ప్రభుత్వం విముఖంగా వుందని పిటిషన్ పేర్కొంది. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుపార్ మెహతా స్పందిస్తూ, ఈ అంశం దేశీయ విధానం పరిధిలోనే వుందని పేర్కొన్నారు. ఆ విధానమే ఏమిటన్నది తెలుసుకోవాలనుకుంటున్నామని, కాబట్టి దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఒకసారి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరిస్తే, వాటికి పూర్తి స్థాయి ప్రతిపత్తి ఇవ్వాలని పిటిషన్ కోరింది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు అన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు ఈ కేంద్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు వీలుగా ఉత్పత్తి లైసెన్సులు జారీ చేయడం ద్వారా వీటిని పునరుద్ధరించాల్సి వుందని ఆ పిటిషన్ పేర్కొంది. నాణ్యతా ప్రమాణాలు బాగుండి, అందుబాటు ధరల్లో వున్నట్లైతే వ్యాక్సిన్ ఉత్పత్తి లేదా ప్రభుత్వ వ్యాక్సిన్ సేకరణ కార్యక్రమాల నుండి ప్రభుత్వ రంగ సంస్థలు వేటినీ మినహాయించరాదని పిటిషన్ కోరింది.