Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘాల జంగ్ సైరన్ ధర్నా
- పలువురు నేతలు మద్దతు
న్యూఢిల్లీ : జన గణనలో భాగంగా బీసీల కులగణన చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే మండల్ ఉద్యమ తరహాలో దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సోమవారం నాడిక్కడ జంతర్ మంతర్లో తెలంగాణ,ఏపీ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బిసిల జంగ్ సైరన్ ధర్నా జరిగింది. ఈ ధర్నా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ కులగణన జరిగితే అట్టడుగు వర్గాల్లోని బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు ప్రతి ఫలాలు అందాల్సిందేనన్నారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోడీ బీసీ గణనపై పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రంపై బీసీలు యుద్దం ప్రకటిస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ ప్రధానిగా చెప్పుకునే మోడీ ఉన్నా బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగడం లేదన్నారు. న్యాయం చేయాల్సిన కేంద్రం తప్పించుకుంటుంటే, అడగాల్సిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఆర్ సర్కార్ మౌనంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ గణన చేయాలని కోరలేని టీఆర్ఎస్ వంటి ప్రభుత్వాలు.. బీసీలకు అవసరమా? అని నిలదీశారు. నిజంగా బలహీన వర్గాలపై టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే, పార్లమెంట్ సమావేశాలు బహిష్కరణ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ ధర్నా చేస్తోన్న బీసీలకు మద్దతు తెలపాలన్నారు. బిసిలు ఏకమై కేంద్రానికి బుద్ధి చెపాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. బీసీలు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టి పూర్తి మద్దతు తెలుతుందని ప్రకటించారు. త్వరలోనే రాహుల్ గాంధీతో బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటును స్తంబింప చేసే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ ధర్నాలో పావులూరి హనుమంతరావు, కుల్కచర్ల శ్రీనివాస్, కనకలశ్యాం, తాటికొండ విక్రం, రాచాల యుగెంధర్, కుమ్మరి కాంత్రి కూమార్, మణి మంజరి, పద్మ, భాగ్యలక్ష్మి తదితర పాల్గొని ప్రసంగించారు.