Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణపై క్యాబినెట్ కమిటీ ఇంకాఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభలో మన్నె శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర బడ్జెట్లో 2021-22లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానానికి ఆమోదం తెలిపే ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన వివిధ సమస్యల పరిశీలన, ఇతర అంశాల్లో బ్యాంకుల ఎంపికను ఈ ప్రయోజనం కోసం నియమించబడిన క్యాబినెట్ కమిటీకి అప్పగించామనీ, అయితే పీఎస్‌బీల ప్రయివేటీకరణకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
కేంద్ర విద్యా సంస్థల్లో 1,787 ఎస్సీ, ఎస్టీ పోస్టులు ఖాళీలు
జాతీయ విద్యా సంస్థల్లో 1,787 ఎస్సీ, ఎస్టీ పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 2,272 ఎస్సీ రిజర్వ్ద్ పోస్టులు మంజూరు కాగా, అందులో 1,257 పోస్టుల భర్తీ కాగా, 1,015 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 1,154 ఎస్టీ రిజర్వ్డ్ పోస్టులు మంజూరు కాగా, అందులో 564 పోస్టులు భర్తీ అయ్యాయి. 590 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఐజీఎన్ఓయూ)లో 120 ఎస్సీ రిజర్వ్ద్ పోస్టులు మంజూరు కాగా, అందులో 66 పోస్టుల భర్తీ కాగా, 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలాగే 53 ఎస్టీ రిజర్వ్డ్ పోస్టులు మంజూరు కాగా, అందులో 27 పోస్టులు భర్తీ అయ్యాయి. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 105 ఎస్సీ రిజర్వ్ద్ పోస్టులు మంజూరు కాగా, అందులో 39 పోస్టుల భర్తీ కాగా, 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 41 ఎస్టీ రిజర్వ్డ్ పోస్టులు మంజూరు కాగా, అందులో 5 పోస్టులు భర్తీ అయ్యాయి. 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జాతీయ విద్యా సంస్థల్లో వివక్ష, ఇతర కారణాలతో రాజీనామాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్యాకల్టీలకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని కేంద్ర మంత్రి తెలిపారు.
బ్లాక్‌లిస్టులో మల్లారెడ్డి, ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలు
తప్పుడు డేటా సమర్పించడంతో అక్రిడిటేషన్ రద్దు చేశాం..:కేంద్రం
తెలంగాణలోని మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. సీపీఐ ఎంపీ ఎం.సెల్వరాజ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తప్పుడు డేటాను సమర్పించడం ద్వారా అక్రిడిటేషన్ పొందే కాలేజీల అక్రిడిటేషన్ రద్దు చేసి, ఆయా కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడుతున్నదని తెలిపారు. గత రెండేండ్లలో దేశంలోని మూడు కాలేజీలను బ్లాక్ లిస్టులో పెట్టామనీ, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, తెలంగాణలోని మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన భగవాన్ యూనివర్సిటీలను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు తెలిపారు.
పదేండ్లలో సీపీఎస్ఈల ఆదాయం రూ.2,12,40,915 కోట్లు
పదేండ్లలో కేంద్ర పభుత్వ రంగ పరిశ్రమల నిర్వహణతో రూ.2,12,40,915 కోట్ల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావు కరడ్ పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత పదేండ్లలో జాయింట్ స్టాక్, ప్రభుత్వ కంపెనీలలో ప్రభుత్వం రూ. 3,69,188.87 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు మంత్రి తెలిపారు.
ఏడాది ఆదాయం (కోట్లలో)
2011-12 రూ. 18,41,927
2012-13 రూ. 19,45,777
2013-14 రూ. 20,61,866
2014-15 రూ. 19,95,902
2015-16 రూ. 18,54,667
2016-17 రూ. 19,54,616
2017-18 రూ. 21,55,948
2018-19 రూ. 25,43,370
2019-20 రూ. 24,61,712
2020-21 రూ. 24,25,130
మొత్తం రూ.2,12,40,915
తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలకు రూసా నిధులు నిల్
2021-22లో రూసా కింద రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయలేదని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధాం ఇచ్చారు. గత మూడేండ్లలో రాష్ట్రంలోని యూనివర్శిటీలకు రూసా కింద రూ.186.29 కోట్లు విడుదల చేశారనీ, కానీ ఈ ఏడాది (2021-22) ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు. 2018-19లో రూ.100.10 కోట్లు, 2019-20లో రూ.52.08 కోట్లు, 2020-21లో రూ.34.11 కోట్లు విడుదల చేసినట్టు తెలిపిన కేంద్ర మంత్రి, 2021-22లో మాత్రం విడుదల చేయలేదని తెలిపారు. తెలంగాణకు కూడా 2018-19లో రూ.41.71 కోట్లు, 2019-20లో రూ.55.08 కోట్లు, 2020-21లో రూ.14.47 కోట్లు విడుదల చేయగా, 2021-22లో మాత్రం విడుదల చేయలేదు.
దేవాలయాల పరిశుభ్రతకు పథకంలేదు..
దేవాలయాల్లో శుభ్రం (క్లీన్) చేసేందుకు ఎటువంటి పథకం లేదని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఎంవివి సత్యన్నారాయణ,ఎన్ రెడ్డప్ప, ఎం.గురుమూర్తి లు ఏపిలో తిరుపతి ఆలయం, రాఘవీరేంద్రస్వామి ఆలయాల్లో స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ పథకం కింద క్లీన్ చేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖలో అటువంటి పథకం లేదని తెలిపారు.