Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యులపై సస్పెండ్ ఎత్తివేయాలంటూ నిలదీత
- దద్దరిల్లిన రాజ్యసభ...ప్రతిపక్షాల వాకౌట్
- పార్లమెంట్ దాడిలో అమరులకు సంతాపం
- ఉభయ సభల్లో రెండు బిల్లులు ఆమోదం
- దేశంలో పాఠశాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాల్ణి జర్నాదాస్
బైద్యా సీపీఐ(ఎం)
- సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలో స్త్రీలను కించపరుస్తారా..! సోనియా అభ్యంతరం
న్యూఢిల్లీ : 12 మంది సభ్యుల సస్పెన్షన్పై రాజ్యసభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు 2001లో పార్లమెంట్ దాడిలో అమరవీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానం చదివి వినిపించారు. అనంతరం కాంగ్రెస్ నేత ఆనంద శర్మ మాట్లాడుతూ ఎంపీల సస్పెండ్ అయి 10 రోజులు అవుతున్నదనీ, సభలో జరిగిన చర్చల్లో భాగస్వామ్యం కాలేకపోయారని అన్నారు. సభ్యులపై సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి ముగింపు పలికేందుకు మార్గాన్ని సూచించాలని తెలిపారు. చైర్మెన్ వెంకయ్య జోక్యం చేసుకొని రెండు వైపుల (అధికార, ప్రతిపక్షం) ముందు ఎవరైతే తప్పు చేశారో వారు ఒప్పుకోవడమే మార్గమని అన్నారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం అధికార, ప్రతిపక్షం చూస్తాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ ''సభ సజావుగా నిర్వహణకు తాము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వమే తీర్మానం ప్రవేశపెట్టింది కనుక ప్రభుత్వానిదే బాధ్యత. అందువల్ల ప్రభుత్వం ముందుకు కొచ్చి, ఈ సమస్యకు ముగింపు పలకాలి'' అని కోరారు. చైర్మెన్ వెంకయ్య జోక్యం చేసుకొని ''ఇరు పక్షాలు ముందుకొచ్చి మార్గం గుర్తిస్తే సభ సజావుగా సాగుతుంది. అందరు దీన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను'' అని అన్నారు. అనంతరం జీరో అవర్ ప్రారంభించారు.
12 శాతం ప్రభుత్వపాఠశాలల్లోనే ఇంటర్నెట్..
సీపీఐ(ఎం) ఎంపీ జర్నదాస్ బైద్యాను మాట్లాడుతూ దేశంలోని అన్ని పాఠశాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. 2021-22లో దేశంలో 22.3 శాతం ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల్లోనే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నదని అన్నారు. కేంద్ర విద్య శాఖ రిపోర్టు ప్రకారం దేశంలో 12 శాతం ప్రభుత్వ పాఠశాల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నదనీ, అలాగే 30 శాతం కంటే తక్కువే కంప్యూటర్ సదుపాయం ఉన్నదని తెలిపారు. దేశంలోని మెజార్టీ పాఠశాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలు లేవని, కొన్ని కేంద్ర పాలిత పాంత్రాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలు బాగున్నాయని అన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాల్లో 88.8 శాతం, ప్రయివేట్ పాఠశాల్లో 83 శాతం కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కేరళలో 90.74 శాతం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్నదని తెలిపారు. ఈ పరిస్థితి దేశంలోని అన్ని పాఠశాల్లో కూడా ఉండాలని, అందుకు కేంద్రం దృష్టి పెట్టాలని సూచించారు.
ఆమె మాట్లాడుతుండగానే 12 మంది సభ్యుల సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ '' మీకు, అధికార పక్ష నేతగా విన్నవిస్తున్నాం. మీరు సభ సంరక్షకులు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నాం. మీరు ప్రతిసారి మా విన్నపాన్ని తిరస్కరిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని పదే పదే కోరుతున్నా, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. మళ్లీ తిరిగి మమ్మల్ని నిందిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కలిగించే విధంగా ప్రోత్సహిస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కనుక తాము వాకౌట్ చేస్తున్నాం'' అని అన్నారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభను వాకౌట్ చేస్తూ వెళ్తున్న సందర్భంలో కాస్తా గందరగోళం నెలకొంది. వెంటనే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తనకు సలహాలు ఇవ్వొద్దని, సభ సజావుగా లేనందున వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. దీంతో ప్రారంభమైన 12 నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్లో ఆందోళనకు దిగాయి. మరోవైపు అధికార పక్షనేత, కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమై మూడు నిమిషాలకే రెండు గంటల పాటు వాయిదా పడింది. విరామం అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనల నడుమ, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా షరతులు) సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
లోక్సభలో ప్రతిపక్షాలు వాకౌట్
లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా 2001లో పార్లమెంట్ దాడిలో అమరవీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానం చదివి వినిపించారు. అనంతరం సభలో సభ్యులంతా సంతాపం తెలుపుతూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు జరిగాయి.
సీబీఎస్ఈలో ఆర్ఎస్ఎస్,బీజేపీ జోక్యంతోనే..
తరువాత జీరో అవర్ జరగగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలో ''కఠినంగా స్త్రీద్వేషి'' ప్రశ్నలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సీబీఎస్సీ ఈ అభ్యంతరకరమైన ప్రశ్న వెనుక ఆర్ఎస్ఎస్,బీజేపీ కుట్ర దాగిఉన్నదనీ, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తీవ్రమైన లోపంపై కేంద్ర విద్యా శాఖ సమీక్షించాలని, ఇది పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ''మొత్తం స్త్రీలను ఖండించదగిన ఆలోచనలతో నిండి ఉంది. అనుసరించే ప్రశ్నలు సమానంగా అర్ధంలేనివి'' అని సోనియా అన్నారు. ''అటువంటి కఠోరమైన స్త్రీద్వేషపూరిత విషయాలను'' తీవ్రంగా వ్యతిరేకించారు. ''విద్య, పరీక్షపై ప్రమాణాలపై చాలా పేలవంగా ప్రతిబింబిస్తుంది'' అని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ,సీబీఎస్ఈని వెంటనే ప్రశ్నను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని కోరారు. వెంటనే ప్రతిపక్షాలు ఈ అంశంపై నిరసించాయి. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. అనంతరం జీరో అవర్ తరువాత సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (సవరణ) బిల్లును చర్చకు పెట్టారు. చర్చ అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.