Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో పెరిగిన కరోనా మరణాలు
- నాడు 10వేలు.. ఇప్పుడు 20 వేలకు
- సుప్రీం ముందుకు అఫిడవిట్
అహ్మదాబాద్: దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా సంబంధించిన వాస్తవ వివరాలు దాస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో కరోనా మరణాలు ఒక్కసారిగా పదివేలకు పైగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 10,098గా ఉన్న కరోనా మరణాలు 19,964కు పెరిగాయి. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అంశంపై సుప్రీంకోర్టుకు గుజరాత్ సర్కారు సమర్పించిన జాబితాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అసాధారణంగా పెరిగిన మరణాలతో దేశ కరోనా మరణాల సంఖ్య 4.85 లక్షలకు పెరిగింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ ఈ సందర్భంగా అఫిడవిట్‌ను దాఖలు చేశాయి. కరోనావైరస్ పరిహారం కోసం మొత్తం 34,678 దరఖాస్తులు వచ్చాయనీ, 19,964 దరఖాస్తులకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించినట్టు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు కోవిడ్-19 పరిహారం కోసం 87వేల దరఖాస్తులు రాగా.. 8000 కేసుల విషయంలో చెల్లింపులు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో వెల్లడించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిహారం బాధితులకు త్వరగా అందించాలని సూచించింది. ఇదిలావుండగా, గుజరాత్ ప్రభుత్వం కరోనా మరణాల విషయాలు అధికారికంగా వెల్లడించిన దాని కంటే 10 వేలు అధికంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కరోనా వాస్తవ విషయాలు దాస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.