Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10.09 శాతానికి చేరిక
- గ్రామీణ ప్రాంతాల్లో 7.42 శాతం
- భారత్‌లో మొత్తం నిరుద్యోగం 8.53 శాతం : సీఎంఐఈ
న్యూఢిల్లీ : భారత్‌లో పట్టణ నిరుద్యోగం ఆందోళనను కలిగిస్తున్నది. ఇది డిసెంబర్ 12తో ముగిసిన వారానికి 10.09 శాతానికి చేరింది. గత 17 వారాల్లో పట్టణ నిరుద్యోగం రెండెంకెల సంఖ్యకు చేరుకోవడం ఇది మొదటి సారి కావడం గమనార్హం. ఇటు భారత్దేశంలో మొత్తం నిరుద్యోగ రేటు 8.53 శాతంగా (తొమ్మిది వారాల గరిష్టం) ఉన్నది. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ)' ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.42 శాతంతో తొమ్మిది వారాల గరిష్టానికి చేరింది. ''ఉద్యోగాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను, తగిన ఉద్యోగాలను సృష్టించలేని ఆర్థిక వ్యవస్థ అసమర్థతను ప్రస్తుత అధిక నిరుద్యోగ రేటు ప్రతిబింబిస్తుంది '' అని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేశ్ వ్యాస్ అన్నారు.
సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. పట్టణ నిరుద్యోగం గత రెండువారాల్లో పెరిగింది. నవంబర్ నెలలో ఇదే పరిస్థితి ఉన్నది. నగరాలు, పట్టణాల్లో ఉపాధి, ఉద్యోగాల సంఖ్య 9 లక్షలు తగ్గింది. ట్రావెల్, హాస్పిటాలిటీ, విద్యా రంగాల్లో ఉద్యోగాలు పడిపోవడమే పట్టణ నిరుద్యోగ పెరుగుదల వెనుకున్న కారణంగా కనిపిస్తున్నదని అవెన్యూ గ్రోత్ వ్యవస్థాపక సీఈఓ రచిత్ మాతూర్ తెలిపారు.
ఈ ఏడాది ఆగష్టు 15 ముగింపు వారం నాటికి ఉన్న నిరుద్యోగ గణాంకాలను చూస్తే.. భారత్‌లో మొత్తం నిరుద్యోగం 8.03 శాతంగా ఉన్నది. ఇక పట్టణ నిరుద్యోగం 10.23 శాతంగా, గ్రామీణ నిరుద్యోగం 7.01 శాతంగా నమోదయ్యాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆశా కిరణమైన మహత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూడా ఉపాధి దెబ్బను ఎదుర్కొన్నది.
ఉపాధి హామీ తాత్కాలిక గణాంకాల ప్రకారం.. జూన్‌లో అత్యధికంగా 45 కోట్లున్న పని దినాల సంఖ్య అక్టోబర్-నవంబర్‌లో 21-22 కోట్లకు పడిపోయింది. ఈ డిసెంబర్లో తొలి 13 రోజుల్లోనే పని దినాలు మరో 1.5 కోట్లు పడిపోవడం గమనార్హం.