Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత నాలుగేండ్లలో ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వం రూ.8,504.84 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2017-18లో రూ.2,721.21 కోట్లు, 2018-19లో రూ.2,767.55 కోట్లు, 2019-20లో రూ.1,802.78 కోట్లు, 2021-21లో రూ.1,213.3 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు.
ఆ కౌన్సిల్ సిఫారసు చేయలేదు : పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చటంపై కేంద్ర మంత్రి
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలో చేర్చటంపై జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు తమకు ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
గత మూడేళ్లలో 30,440 చిన్నారులు ఆత్మహత్యలు
గత మూడేళ్లలో 30,440లో చిన్నారులు (18 ఏండ్లలోపు) ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర హౌం శాఖ సహాయ అజరు కుమార్ మిశ్రా తెలిపారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2018లో 9,431 మంది, 2019లో 9,613 మంది, 2020లో 11,396 మంది 18 ఏండ్లలోపు చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు. చిన్నారులు ఆత్మహత్యలు ఏడాదికి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి.
పెండింగ్‌లో 17,89,601 మహిళలపై దాడుల కేసులు
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి 17,89,601 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తెలిపారు. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2018లో 3,78,236, 2019లో 4,05,326, 2020లో 3,71,503 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2020 చివరి నాటికి దేశంలో మహిళలపై దాడులకు సంబంధించిన 17,89,601 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2019 వరకు 1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
గత మూడేండ్లలో 4,690 మంది యూఏపీఏ కింద అరెస్టు
దేశంలో గత మూడేండ్లలో 4,690 మంది యూఏపీఏ కింద అరెస్టు అయ్యారనీ, అందులో 30 ఏండ్ల లోపు యువకులు 2,501 మంది ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2018లో 1,421, 2019లో 1,948, 2020లో 1,321 మంది యూఏపీఏ కింద అరెస్టు అయినట్టు తెలిపారు. 2018లో 755, 2019లో 1,096, 2020లో 650 మంది యువకులు యూఏపీఏ కింద అరెస్టు అయినట్టు పేర్కొన్నారు. ఇందులో అత్యధికమంది ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నట్టు తెలిపారు. యూపీలో మూడేండ్లలో 1,338 మంది యూఏపీఏ కింద అరెస్టు కాగా, అందులో 931 మంది యువకులే అరెస్టు అయ్యారని తెలిపారు.
ఈ ఏడాదిలో ఎన్హెచ్ఆర్సీలో 67,255 ఫిర్యాదుల నమోదు
ఈ ఏడాదిలో నవంబర్ 15 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో 67,255 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
2018-19లో 89,584, 2019-20లో 76,628, 2020-21లో 74,968, 2021-22 (నవంబర్ 15 వరకు) 67,255 ఫిర్యాదులు నమోదయినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
ఏడేండ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు 8,81,254 మంది
గత ఏడేండ్లలో 8,81,254 మంది భారతీయులు పౌరుసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015లో 1,31,489, 2016లో 1,41,603, 2017లో 1,33,049, 2018లో 1,34,561. 2019లో 1,44,017, 2020లో 85,248, 2021 (సెప్టెంబర్ 30 వరకు) 1,11,287 మంది పౌరుసత్వాన్ని వదులుకున్నారని తెలిపారు.
వ్యవసాయ యూనివర్శిటీల్లో 12,576 పోస్టుల ఖాళీలు
దేశంలోని వ్యవసాయ యూనివర్శిటీల్లో 12,576 పోస్టుల ఖాళీలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021 జూలై వరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ యూనివర్శిటీలకు మంజురైన 33,686 పోస్టులు ఉండగా, అందులో 12,576 పోస్టుల ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఐదేండ్లలో 2,45,431 ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు నమోదు
దేశంలో గత ఐదేండ్లలో 2,45,431 ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు నమోదు అయినట్టు కేంద్ర సామాజిక న్యాయం సహాయ మంత్రి రాందాస్ అథ్వాలే తెలిపారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016లో 47,338, 2017లో 50,094, 2018లో44,505, 2019లో 49,608, 2020లో 53,886 ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు అయినట్టు తెలిపారు.
17 మహిళా క్రీడాకారుల లైంగిక వేధింపులు కేసులు
దేశంలో గత నాలుగేళ్లలో మహిళా క్రీడాకారుల లైంగిక వేధింపుల కేసులు 17 నమోదు అయ్యాయని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వివిధ పార్టీల ఎంపిలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 2018లో ఏడు, 2019లో ఆరు, 2020లో ఒకటి, 2021లో 3 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.