Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ ఘటన
- ఉద్దేశపూర్వకంగానే రైతులపై హింస : సిట్
న్యూఢిల్లీ : రైతులను హత్య చేయడానికి పక్కా ప్రణాళికతోనే కుట్ర జరిగిందనీ, అందులో భాగంగానే లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును హత్య చేశారు. అంతమొందించాలనే ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందని పేర్కొంది. అక్టోబర్ 3 లఖింపూర్ ఖేరీ ఘటనపై రెండు నెలల విచారణ తర్వాత, నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్యలో కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో పాటు మరో 12 మంది ఉన్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను కోర్టుకు సమర్పించింది. 13 మంది నిందితులపై హత్యాయత్నానికి పాల్పడిన అభియోగాల కింద శిక్షార్హమైన నేరాన్ని శిక్షించేలా కొత్త సెక్షన్లను చేర్చాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) ముందు సిట్ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. ఐపీసీలోని 279, 338, 304(ఏ) సెక్షన్ల స్థానంలో కొత్త సెక్షన్లను వారెంట్లో చేర్చాలని సిట్ దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ సోమవారం సీజేఎం కోర్టులో దరఖాస్తు చేశారు. తన దరఖాస్తులో దర్యాప్తు అధికారి ఈ ఘటన ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వక చర్య అనీ, నిర్లక్ష్యం వల్ల జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లఖింపూర్ ఖేరీ జైలులో ఉన్న నిందితులపై హత్యాయత్నం, ఇతరులపై అభియోగాలు మోపాలని కూడా కోరింది.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలతో పాటు మొత్తం 13 మందిపై ఐపీసీ సెక్షన్లు 307, 326, 34తో (హత్య, నేరపూరిత కుట్ర, ఇతరులలో) పాటు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 3, 25, 30లను ప్రయోగించాలని సిట్ కోర్టును కోరినట్టు లఖింపూర్ ఖేరీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్పీ యాదవ్ తెలిపారు. సిట్ దరఖాస్తుపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐపీసీ సెక్షన్ 307 హత్యా ప్రయత్నానికి సంబంధించినది అయితే, 326 ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాల ద్వారా స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించడం. సాధారణ చర్యలను సూచించే సెక్షన్ 34ను అమలు చేయడంపై డిఫెన్స్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారని యాదవ్ తెలిపారు. నిందితులపై 279 (ర్యాష్ డ్రైవింగ్), 338 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యల ద్వారా తీవ్రంగా గాయపరచడం), 304 ఏ (నిర్లక్ష్యం వల్ల మరణం) సహా మూడు ఐపీసీ సెక్షన్లను ఉపసంహరించుకోవాలని కోర్టును సిట్ అభ్యర్థించింది. అక్టోబరు 3న అజరు మిశ్రాకు చెందిన ఒకటి సహా మూడు ఎస్యూవీల కాన్వారు, లఖింపూర్ ఖేరీలో రైతుల ప్రదర్శనపైకి దూసుకెళ్లింది. వారిలో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు కూడా చనిపోయాడు. మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. సిట్ ఇప్పటి వరకు ఆశిస్ మిశ్రా, లవ్కుష్, ఆశిష్ పాండే, శేఖర్ భారతి, అంకిత్ దాస్, లతీఫ్, శిశుపాల్, నందన్ సింగ్, సత్యం త్రిపాఠి, సుమిత్ జైస్వాల్, ధర్మేంద్ర బంజారా, రింకు రాణా, ఉల్లాస్ త్రివేదిలను అరెస్టు చేసింది. వారిని లఖింపూర్ ఖేరీ జిల్లా జైల్లో ఉంచారు. మరోవైపు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది. అయితే లఖింపూర్ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు విచారణ జరిగింది. దర్యాప్తు మందగిస్తున్న తీరుపై యూపీ సర్కార్ను ధర్మాసనం మందలించింది. ఇప్పుడు సిట్ విచారణ పురోగతిపై కోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉన్నది.మరోవైపు తనయుడు ఆశిష్ మిశ్రాపై సిట్ నివేదిక ఆధారంగా..పలు సెక్షన్ల కింద అదనపు కేసులు బనాయించాలని సూచించింది. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్రమంత్రి అజరు మిశ్రా టెనీ జైలు వద్దకు చేరుకున్నారు. కుమారుడిని కలిసి ఓదార్చారు. అయితే ఆయన మీడియా ప్రశ్నలకు దూరంగా ఉండిపోయారు.