Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాగిరి నశించాలి..
- గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్‌కు ప్రతిపక్షాలు మార్చ్
- రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్
- ప్రతిపక్ష సభ్యుల్లేకుండానే సీబీఐ, ఈడీ బిల్లులకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల సభ్యుల నినాదాలతో పార్లమెంట్ హౌరెత్తింది. మంగళవారం 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలనీ, అధిక ధరలు, నిరుద్యోగం, చర్చలు లేకుండా చట్టాలను బలవంతంగా చేయడాన్ని నిరసిస్తూ, అలాగే ఏడాది పాటు జరిగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుంచి విజరు చౌక్ వద్దకు మార్చ్ నిర్వహించారు. ''ఎంపీలపై అక్రమంగా బనాయించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలి. మోడీ సర్కార్ డౌన్ డౌన్. దాదాగిరి నశించాలి. మాకు న్యాయం కావాలి. అహంకారం నశించాలి. మోడీ హఠావో, దేశ్ బచావో'' అంటూ నినాదాల హౌరెత్తించారు.
ప్రజాసమస్యలపై చర్చకు అనుమతించలేదు.. రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమను చర్చకు అనుమతించటం లేదని విమర్శించారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏ సమస్యను లేవనెత్తడానికి తమకు అనుమతి ఇవ్వటం లేదనీ, ప్రజాస్వామ్యం దురదృష్టవశాత్తు హత్యకు గురవుతోందని విమర్శించారు. ఒక కేంద్ర మంత్రి రైతులను చంపేశాడనీ, ప్రధాని మోడీకీ తెలుసని అన్నారు. ''నిజం ఏమిటంటే ఇద్దరు ముగ్గురు కార్పొరేట్లు రైతులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీలను రాజ్యసభ చైర్మెన్, లేదా ప్రధాని సస్పెండ్ చేయలేదు. కానీ అధికారంతో రైతుల ఆదాయాన్ని దొంగిలించాలని వారు కోరుకుంటున్నారు. ప్రధాని, చైర్మెన్ కేవలం వాటిని అమలు చేస్తున్నారు'' అని విమర్శించారు. ''ఇది (12 మంది ఎంపీల సస్పెన్షన్) దేశ ప్రజల గొంతును నొక్కటానికి చిహ్నంగా ఉన్నది. వారి గొంతులు నలిగిపోయాయి. వారు ఏ తప్పు చేయలేదు. పార్లమెంటులో ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి మాకు అనుమతించటం లేదు'' అని ఆయన విమర్శించారు. పార్లమెంట్లో బిల్లుల తర్వాత బిల్లులు ఆమోదం పొందుతున్నాయని ఆయన అన్నారు. ఇది పార్లమెంటును నడిపించే పద్ధతి కాదనీ, ప్రధాని సభకు రారని ఆరోపించారు.
వురు వాంట్ జస్టిస్
సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు వెల్‌లో దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. 'వురు వాంట్ జస్టిస్' అనే నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా పడింది. ''సభలో మర్యాదను కాపాడుకుందాం. వికృత, అన్‌పార్లమెంటరీ ప్రవర్తన అస్సలు పని చేయదు'' అని చైర్మెన్ వెంకయ్య నాయుడు అంటూ వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్లకార్డుల పట్టుకొని నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన నడుమ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ''ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు''ను ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలనీ, 12 రోజులుగా వారు బయటే ఉన్నారని విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ మాట్లాడుతూ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీనికి డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ సింగ్ తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. అనంతరం బీజేపీ, బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకే, ఏజీపీ, టీఎంసీ (ఎం), వైసీపీ, టీడీపీ తదితర పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొని, బిల్లులను ఆమోదించుకున్నారు.
కొనసాగిన సస్పెండ్ ఎంపిల ధర్నా
మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆయన కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీల మార్చ్ నిర్వహణ ప్రతిపాదనను ఆమోదించారు. అనంతరం రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ''రాజ్యసభ చైర్మెన్‌కు ఏదైనా నియమాన్ని సస్పెండ్ చేయడానికి, ఆదేశాలు జారీ చేయడానికి, రద్దు చేయడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దానిని అనుమతించడం లేదు. తిరిగి తీసుకురావడానికి చైర్మెన్ తన అధికారాలను ఉపయోగించమని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ 12 మంది (సస్పెండ్ చేయబడిన) ఎంపీలు సభకు వచ్చేలా చూడాలని కోరుతున్నాను'' అని అన్నారు. మరోవైపు సస్పెండ్‌కు గురైన 12 మంది ఎంపీల ధర్నా మంగళవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పలువురు ఎంపీలు సంఘీభావం తెలిపారు.