Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2013లో సీఎంగా మోడీ అన్నమాటలు.. ప్రధాని అయ్యాక ఆచరణలోకి..
- పబ్లిక్ సెక్టార్లో పదేండ్లలో పెట్టుబడులు రూ.3.70 లక్షల కోట్లు
- వచ్చిన ఆదాయం రూ.212 లక్షల కోట్లు.. సుమారు 58 రెట్లు అధికం
- మరి ఎందుకు ప్రభుత్వం ప్రయివేటీకరణకు మొగ్గుచూపుతోంది?
''పబ్లిక్ సెక్టారు పుట్టిందే చావడానికి.. కొన్ని ముందు చస్తారు ! కొన్ని కొంత కాలం తర్వాత చస్తారు ! చావు మాత్రం తప్పదు! '' ఈ మాటాలు 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేటి ప్రధాని మోడీ అన్న మాటలు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ప్రభుత్వం మాత్రం వాటిని ప్రయివేటీకరించడానికే మొగ్గు చూపుతోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం... గత పదేండ్లలో సీపీఎస్ఈల్లో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి రూ.3,69,188.87 కోట్లు.. అయితే వాటి నుంచి వచ్చిన ఆదాయం రూ.2,12,40,915 కోట్లు. ప్రభుత్వ సంస్థల నుంచి ఆదాయం రికార్డు స్థాయిలో వస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రయివేటీకరణకే మొగ్గు ఎందుకు చూపోతోంది? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నే ! ఇదే సమయంలో లక్షల కోట్లు రూపాయలను కార్పొరేట్లు ఎగ్గొట్టారని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఇది కొస మెరుపు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభిస్తోంది. అయితే, కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభు త్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరించడానికే మొగ్గు చూపుతోంది. వాటి నుంచి పెట్టుబడులను ఉపసంహ రించుకుంటున్నది. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల నిర్వహణతో రూ.2,12,40,915 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో జాయింట్ స్టాక్, ప్రభుత్వ కంపెనీలలో ప్రభుత్వం రూ.3,69,188.87 కోట్లు పెట్టుబడి పెట్టిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కిషన్ రావు కరడ్ లోక్‌సభలో వెల్లడించారు. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీఎంసీ ఎంపీ మాలరారులు ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణకు సంబంధించి అడిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పై వివరాలు తెలియజేశారు. ఆయన వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలావున్నాయి...
మోడీ హయాంలో సీపీఎస్ఈల్లో రూ.3,62,766 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడేండ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ (సీపీఎస్ఈ)ల్లో రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్టు కేంద్ర మంత్రి భగవత్ కిషన్‌రావు కరడ్ తెలిపారు. 2014-15 నుంచి 2020-21 వరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో మొత్తం రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. 2020-21లో డిజిన్వెస్ట్‌మెంట్ రసీదుల కోసం సవరించిన అంచనా రూ.32,000 కోట్లు కాగా, 31 మార్చి 2021 నాటికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ రశీదు రూ.32,845 కోట్లుగా ఉంది.
2022-25 ఆర్థిక సంవత్సరాల్లో ఎన్ఎంపీ కింద గుర్తించిన సంస్థలు
2022-25 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద గుర్తించిన సంస్థ వివరాలను సైతం కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావ్ కరడ్ వెల్లడించారు. వాటిలో సీఈఎల్, బీఈఎంఎల్ లిమిటెడ్, సెయిల్, పవన్ హన్స్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిలాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ఇండియా, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్హెచ్ఏఐఎల్, ఏఏఐ, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎల్సీ ఇండియా, ఎఫ్‌సీఐ, జీఏఐఎల్, హెచ్‌పీసీఎల్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి మొత్తం 36 సంస్థలు ఉన్నాయి. అయితే, పైన పేర్కొన్న విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాలయ ఆదాయం వస్తున్నది. అయితే, మోడీ గతంలో అన్నట్టు ప్రభుత్వ సంస్థలు పుట్టిందే ప్రయివేటుకు అనే దానిని ఆచరణలోకి తీసుకువచ్చి.. తన కార్పొరేటు దోస్తులకు కట్టబెట్టే విధంగా ముందుకు సాగుతున్నారు.
ఆయా ఏడాదుల్లో వచ్చిన ఆదాయం (కోట్లలో)
2011-12 రూ. 18,41,927
2012-13 రూ. 19,45,777
2013-14 రూ. 20,61,866
2014-15 రూ. 19,95,902
2015-16 రూ. 18,54,667
2016-17 రూ. 19,54,616
2017-18 రూ. 21,55,948
2018-19 రూ. 25,43,370
2019-20 రూ. 24,61,712
2020-21 రూ. 24,25,130
మొత్తం రూ.2,12,40,915
ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ (కోట్లలో)
2014-15 రూ.24,349
2015-16 రూ.23,997
2016-17 రూ.46,247
2017-18 రూ.1,00,057
2018-19 రూ.84,972
2019-20 రూ.50,299
2020-21 రూ.32,845
మొత్తం రూ.3,62,766