Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకులను ప్రైవేటీకరిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలందే పరిస్థితి ఉండదు. ఫలితంగా వ్యవసాయరంగం కుదేలయ్యే ప్రమాదం కూడా లేక పోలేదు. నేడు దేశంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులు పట్టణాల్లో మాత్రమే కనిపిస్తాయే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్రమే. ప్రైవేటు బ్యాంకులు ఎన్ని శాఖల్లో వ్యవసాయానికి రుణాలు ఇస్తున్నాయో ఒక్కసారి గణాంకాలు పరిశీలించాలి. ప్రస్తుతం ఏటా 10వేల మంది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ అవుతున్నారు. బ్యాంకులను ప్రైవేటీకరిస్తే రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. విస్తరించిన బ్యాంకు శాఖలు మూతబడతాయి. ప్రభుత్వ పథకాల అమలు తగ్గిపోతుంది. ప్రైవేటు బ్యాంకులు కార్పొరేట్లకే రుణాలిస్తారు. వ్యవసాయం చేసుకునే రైతులు, చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వని పరిస్థితి. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తర్వాత 8వేల బ్రాంచీలతో ఉన్న బ్యాంకింగ్ రంగం 1.08లక్షల బ్రాంచ్‌లతో బ్యాంకింగ్ రంగం విస్తరించింది.ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.151లక్షల కోట్లలో డిపాజిట్లు ఉండగా, అడ్వాన్స్ రుణాల కింద రూ.110లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. వాజ్‌పేయి హయాంలోనే బ్యాంకులను ప్రయివేటీకరించడానికి చేసిన ప్రయత్నాలు బ్యాంకు ఉద్యోగుల ప్రతిఘటనతో సాధ్యం కాలేదు. అయితే మోడీ హయాంలో పార్లమెంట్లో నేడు పూర్తి మెజార్టీ రావడంతో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది.
- గుంటూరు శ్యాంబాబు, ఛైర్మన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్,
ఏపీ అండ్ తెలంగాణ