Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌బిఎఫ్‌సిల తీరు ఆన్లైన్ యాప్‌ల పరిస్థితి మరింత దారుణం
బ్యాంకులు, రిజర్వు బ్యాంకు మద్దతుతో కార్యకలా పాలు నిర్వహిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) సామాన్యుడిని వడ్డీలు, చక్రవడ్డీలతో దోచేస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణాలు, వాహన రుణాలు, వస్తువుల కొనుగోలు, విద్యా రుణాలు... ఇలా ప్రతి దానిలోనూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. వ్యక్తిగత రుణాల విషయానికి వస్తే ఏడాదికి బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ 12.99 శాతం, టాటా క్యాపిటల్ 11.25 శాతం, ఐబిఎఫ్ఎల్ 13 శాతం, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ 36 శాతం వరకూ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 16.85 శాతం నుంచి 17.85 శాతం వరకూ వసూలు చేస్తున్నాయి. ఇక ఇంటి రుణాల విషయానికి వస్తే బ్యాంకులతో పోలిస్తే ఇవి వసూలు చేసే వడ్డీలు భారీగా ఉంటున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, ఇతర ప్రయివేటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే తొలుత 8.3 శాతం వడ్డీనే చూపుతుంది. చివరికి ఎన్‌బిఎఫ్‌సిల నుంచి ఇంటి రుణాలు తీసుకున్న వారు ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది.
వాహన రుణాల్లోనూ వేధింపులు
ఇక బ్యాంకులతోపోలిస్తే ఎన్బిఎఫ్సిలే అధికంగా వాహన రుణాలు ఇస్తున్నాయి. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే వాహనాన్ని తీసుకెళ్లి పోతున్నారు. చాలా సందర్భాల్లో పార్కు చేసి ఉన్న వాహనాన్ని తీసుకెళ్లిపోవడంతో, రుణ గ్రహీత ఆ విషయం తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. దీంతో, తక్కువ డౌన్ పేమెంట్‌తో వాహనం వస్తుందని కొనుగోలు చేసి ఆ తరువాత డౌన్ పేమెంట్‌తోపాటు అప్పటివరకూ చెల్లించిన వాయి దాల మొత్తం కూడా కోల్పోయిన వారు లబోదిబో మంటున్నారు.
యాప్‌ల ద్వారా దోపిడీ, అఘాయిత్యాలు
ఇక ఆన్లైన్లో యాప్‌ల ద్వారా రుణాలిస్తామంటూ పలు సంస్థలు అప్పులు తీసుకున్న వారిని విపరీతంగా వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి తీసుకొస్తున్నాయి. గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో ఇటువంటి యాప్‌ల దోపిడీకి దేశవ్యాప్తంగా పలువురు బలయ్యారు. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తన తల్లి ఆసుపత్రిలో ఉండటంతో రూ.73 వేలు రుణం తీసుకున్నాడు. అతని నుంచి రుణ సంస్థ రూ.6 లక్షల 38 వేలు వసూలు చేసింది. ఇటువంటి కేసులు చెన్నై, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయి.
గ్రామాల్లో పేదలకు, చిన్న చిన్న వ్యాపారులకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు, కొన్ని ప్రైవేటు సంస్థలు వడ్డీలకు రుణాలిస్తున్నాయి. ఇవి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునేవే. వీరు వసూలు చేసే పద్ధతులు దారుణంగా ఉంటున్నాయి. చివరికి ఇళ్లను, ఆస్తులను ధారాదత్తం చేసే పరిస్థితి ఉంటోంది. రెండేళ్ల క్రితం కాల్‌మనీ కేసులు, లైంగిక వేధింపులు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన సంగతి తెలిసిందే. బ్యాంకులన్నీ ప్రయివేటు పరమైతే ఎన్‌బిఎఫ్‌సిలు మరింత దోపిడీకి పాల్పడే ప్రమాద ముందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బ్యాంకుల నిర్వహణ లాభాలు ఇలా
సంవత్సరం నిర్వహణ లాభం
(రూ.కోట్లలో)
2009-10 76,945
2010-11 99,981
2011-12 1,16,337
2012-13 1,21,839
2013-14 1,27,632
2014-15 1,38,064
2015-16 1,38,191
2016-17 1,59,022
2017-18 1,55,690
2018-19 1,49,804
2019-20 1,74,336
2020-21 1,93,374
మొత్తం 16,55,215