Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక, ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చేది పిఎస్యులే
- ఎస్బిఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్
ప్రయివేటు సంస్థలకు మాత్రమే నిర్వహణా నైపుణ్యం, పరిపాలనా దష్టత, పారదర్శకత ఉంటాయని, అందువల్ల ప్రభుత్వ బ్యాంకులన్నిటినీ ప్రయివేటుకు అప్పగించేస్తే ప్రజలకు మెరుగైన సేవలందుతాయని కార్పొరేట్ అనుకూల ఆర్థిక వేత్తలుగా వాదిస్తుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తదితరులకు సంబంధించిన రూ.11,300 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో బ్యాంకుల ప్రయివేటీకరణ వాదనను వారు మరింత గట్టిగా వినిపిస్తూ వచ్చారు. కార్పొరేట్ మిత్రుల మన్ననల కోసం కేంద్రంలోని బిజెపి పెద్దలు, వారి ఒత్తిడితో నీతి ఆయోగ్ లాంటి సంస్థలూ ప్రయివేటీకరణ జపం చేస్తున్నాయి. ప్రయివేటీకరణే సర్వ రోగ నివారణి అంటూ ప్రచారం ముంచెత్తుతున్న నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ అందంతా ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేశారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలకు, లాభాలే పరమావధిగా పనిచేస్తున్న ప్రయివేటు సంస్థలకు అస్సలు పోలికే లేదని ఛైర్మన్ హోదాలో గతంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. మనముందున్న సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నది కూడా ప్రభుత్వ రంగ సంస్థలేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగంలోనే బ్యాంకులు కొనసాగించాల్సిన అవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఆ ఇంటర్వ్యూ క్లుప్తంగా ..
నీరవ్ మోడీ కుంభకోణం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థపై సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఎలా?
- ఈ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత నాకు తెలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ప్రజలు డబ్బులు వెనక్కి తీసుకోలేదు. ఇంత కుంభకోణం బయటపడినా వారు ఎందుకుని సొమ్ము వెనక్కి తీసుకోలేదు? ఎందుకంటే అది ప్రభుత్వ బ్యాంకు కాబట్టి. ప్రభుత్వ యాజమాన్యంపై ఉన్న నమ్మకమే దానికి కారణం. అదే ప్రయివేటు సంస్థ అనుకోండి..జనం సొమ్ము కోసం బ్యాంకు మీద పడిపోయేవారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోలేదు. అయితే బ్యాంకు బోర్డుల్లో మాత్రం విశ్వాసం సన్నగిల్లిన మాట నిజం. అందువల్ల ఏదైనా సరి చేయాల్సివుందంటే అది బ్యాంకు బోర్డులనే.
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. బ్యాంకింగ్ సమస్యలన్ని టికీ ఇదే సర్వరోగ నివారణి అంటున్నారు కదా?
- కాదు. సమస్యలన్నిటికీ ప్రయివేటీకరణ అనేది సర్వరోగ నివారణి కానే కాబోదు. ప్రయివేటీకరణ గురించి మాట్లాడే వాళ్లు ముందు ఒక విషయం గమనంలో ఉంచుకోవాలి. ఈ రోజు మనం సంక్షోభాల నుంచి తట్టుకొని నిలబడ్డామంటే దానికి కారణం బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటమే. ఒకవేళ ప్రయివేటు రంగంలో బ్యాంకు ఏదైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా దానిని ఒడ్డున పడేసేందుకు ముందుకొచ్చేది కూడా ప్రభుత్వమే అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ప్రయివేటీకరణ గురించి గొప్పగా చెప్పేవాళ్లు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. అయితే ప్రయివేటు లేదా ప్రభుత్వ రంగ నమూనాల్లో ఏది మంచిదనేది నేనేమీ నిర్ధారించి చెప్పడం లేదు. కానీ వ్యవస్థ ఏదైనా సమస్యలుంటాయన్నది మనం గ్రహించాలి.
ప్రభుత్వ రంగ యాజమాన్యంలోనే ఉంటే అభివృద్ధికి మంచి అవకాశముంటుంది అంటారు అంతేనా?
- చర్చ సమతూకంతో సాగాలి. మనముందు చాలా పెద్ద సామాజిక - ఆర్థిక లక్ష్యాలున్నాయి. ఈ లక్ష్యాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే. ప్రయివేటీకరణ గురించి గొప్పలు చెప్పేవాళ్లు ఈ దేశంలో సమస్యత్మాకమైన, మారుమూల ప్రాంతాల్లో బ్రాంచీలు నడుపుతున్నది ఎవరో చెప్పగలరా? ఇప్పటికీ 12 గంటలు ప్రయాణిస్తే కానీ బ్యాంకు బ్రాంచీ చేరుకోలేని ప్రాంతాలున్నాయి. ఇక సంస్థాగత నిర్వహణ చూద్దాం. ప్రయివేటు రంగంలోనే మెరుగైన సంస్థాగత నిర్వహణ ఉంటుందనేవాళ్లు ఇప్పుడు నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో విచారణ ఎదుర్కొంటున్నవాటిలో ఒక్కటైనా ప్రభుత్వ రంగ సంస్థ ఉందేమో చెప్పగలరా? అవన్నీ ప్రయివేటు కంపెనీలే. ఇప్పుడేదో ఒక బ్యాంకు (పంజాబ్ నేషనల్ బ్యాంకు)ను సాకుగా చూపి ప్రభుత్వ బ్యాంకులన్నిటినీ ప్రయివేటుకు ఇచ్చేద్దామనడం సహేతుకం కాదు. అగ్రశ్రేణి సంస్థాగత సుపరిపాలన సాగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి.