Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టకాలంలోనూ పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉన్న వైనం
'2007-08 నాటి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో భారత దేశంతో పాటు, చైనాలోనూ ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు గణనీయమైన కృషి చేశాయి. స్థూల రుణాన్ని స్థిరీకరించడం, కీలక రంగాలకు నిధులు అండుబాటులో ఉంచడం వంటి చర్యలు నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించాయి. ఈ చర్యలు ఈ రెండు దేశాల ప్రజల్లో కూడా సానుకూల థృక్పదాన్ని పెంపొందించాయి.'
ప్రపంచబ్యాంకు నివేదిక 2013
కష్టకాలాన్ని అధిగమించడంలో జాతీయ బ్యాంకులు ఎన్నో సందర్భాల్లో దేశానికి అండగా నిలిచాయి. ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం కావడానికి ఎంత గానో దోహదపడ్డాయి. జాతీయ బ్యాంకులు చేసిన ఈ కృషిని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు సైతం గుర్తించారు. 2007-08 ఆర్థిక సంక్షోభాన్ని దేశం అధిగమించిన తీరే దీనికి నిదర్శనం. ఆ సమయంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అమెరికాలో బ్యాంకింగ్ రంగం దివాళా తీసింది. మరో విధంగా చెప్పాలంటే అమె రికాలోని ప్రైవేటు బ్యాంకులు కుప్పకూల డంతో ప్రారంభమైన ఈ సంక్షోభం ప్రపంచమంతా వ్యాపించింది. కానీ, భారత దేశంలో మాత్రం భిన్నమైన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఒకదాని తరువాత మరొక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నప్పటికీ , మన దేశంలో బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండ డంతో సంక్షోభ ప్రభావం కనిపించలేదు. ఒకవైపు అమెరికా తన ఆర్థిక వ్యవస్థను, కుప్పకూలిన బ్యాంకింగ్ రంగాన్ని కాపాడు కోవడానికి పెద్ద ఎత్తున బెయిల్అవుట్ ప్యాకేజిలను ప్రకటిస్తున్న సమయంలో మన ఆర్థిక వ్యవస్థ నామమాత్రమైన నష్టంతో బయటపడింది.
ఆ కాలంలోనూ మన బ్యాంకులు లాభాలను ఆర్జించడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేశాయి. వ్యవసాయ రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వడంతో పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీగా నిధులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆర్బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ కాలంలో దాదాపుగా అన్ని బ్యాంకులు నూరు శాతం లక్ష్యాలను సాధించాయి.
అమెరికాలో జాతీయకరణ
ఆ సంక్షోభధాటికి అమెరికా రెండు భారీ ఎన్బిఎఫ్సిలను జాతీయకరించింది. ఆ దేశంలో షాడో బ్యాంకులుగా వ్యవహరించే ఆ రెండు సంస్థలు 5.4 ట్రిలియన్ డాలర్ల అప్పులో కూరుకుపోయాయి. దీనిని అధిగ మించడానికి ఒకటికి, రెండు సార్లు బెయిలవుట్ ప్రకటించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అమెరికన్ ప్రభుత్వం చివరికి వాటిని జాతీయం చేయాల్సివచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీటిలో ఒక సంస్థను 1929 మహా సంక్షోభం అనంతరం ప్రభుత్వ రంగంలో 1938లో ఏర్పాటు చేశారు. 30 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో సేవలు చేసిన తరువాత 1968లో ప్రైవేటుకు అప్పగించారు. ప్రయివేటు యాజమాన్యాలు అనుసరించిన విధానాల కారణంగా చివరకు అది నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2008లో తిరిగి జాతీయ కరణ చేసే సమయానికి మరో ప్రైవేటు బ్యాంకుతో కలిసి 5.4 ట్రిలియన్ డాలర్ల అమెరికన్ పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని అది కాజేసింది. వీటితో పాటు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూపు, ఎఐజి, బేర్ స్టేర్న్స్ వంటి ప్రైవేటు బ్యాంకులకు ఆమెరికా ప్రభుత్వం బెయిల్ అవుట్ ప్రకటించింది.
అదొక్కటే కాదు.!
2007-08 సంక్షోభంలోనే కాదు, అంతకు ముందు కూడా భారతీయ బ్యాంకులు కష్టకాలంలో దేశానికి అండగానే ఉన్నాయి జాతీయకరణ లక్ష్యాలను అంటిపెట్టుకుని ఉండటమే దీనికి కారణం. 2000-01లో చోటుచేసుకున్న డాట్కామ్ సంక్షోభ సమయంలోనూ, 1990 నాటి ఆసియన్ ఆర్థిక సంక్షోభంలోనూ, 1990-2000 నాటి లాటిన్ అమెరికా సంక్షోభం, ఆ కాలంలోనే చోటుచేసుకున్న జపాన్ సంక్షోభంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా ఉండటానికి జాతీయ బ్యాంకుల పనితీరే కారణం. ఈ అనుభవాలను చూసిన తరువాత అనేక దేశాలు బ్యాంకులలో ప్రభుత్వ రంగ వాటాలను పెంచడంపై దృష్టి సారించాయి. 2013 నాటి ప్రపంచ బ్యాంకు నివేదిక సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఈ అనుభవాలను విస్మరించి బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి సిద్దపడటం ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారనుంది.