Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా ఉన్న పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టారు. అనివార్యమైన పరిస్థితుల్లోనే ఈ నెల 16, 17 తేదీలలో సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రకటించింది. నిజానికి ఈ ఏడాది మార్చిలోనే బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. ప్రైవేటీకరణ వద్దని, అది దేశ ప్రయోజనాలకు ముప్పు అని నినదించారు. సొంత వేతన డిమాండ్లు కాకుండా దేశ హితం కోరి కదం తొక్కారు. అయినా, నెలల వ్యవధిలోనే మరోసారి సమ్మె శంఖారావం పూరించాల్సిన స్థితి ఎందుకు ఎర్పడింది? గతంలో మాదిరే ఈ సమ్మె కూడా వేతన డిమాండ్ల కోసం కాదు! ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం కాదు! మరి ఎందుకోసం? ....
బ్యాంకుల ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాలకు ముప్పు అంటూ బ్యాంకు ఉద్యోగులు చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. లక్షల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు ఎలా అప్పచెబుతారంటూ వారడిగిన ప్రశ్నలను బేఖాతరు చేసింది. జాతి నిర్మాణంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటిదాకా భాగస్వామ్యమైన తీరును గణాంకాలతో సహా వివరించినా కేంద్రం పట్టించుకోవడం లేదు. పల్లెసీమల్లో, మారుమూల ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను గుర్తుచేస్తూ కార్పొరేట్ల రంగ ప్రవేశంతో అన్నదాతకు అండ ఉండదని, రైతన్నల గుండె బద్దలవుతుందని చెప్పినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనూ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును తీసుకురావడానికి, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను కార్పొరేట్లకు అప్పచెప్పడానికి సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం వెలువడగానే బ్యాంకు ఉద్యోగులు సమ్మె నగారా మోగించారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసిరమ్మని ప్రజలకు పిలుపునిచ్చారు.
పోరాటం ఇలా...
ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికిప్పుడు ప్రారంభించిందేమీ కాదు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి ఏదో రూపంలో ఈ ప్రతిఘటన చోటుచేసుకుంటూనే ఉంది. ప్రభుత్వాలు ఆ విధానాలను ఉధృతంగా ముందుకు తీసుకువెడుతున్న కొద్దీ ఉద్యోగుల పోరాటమూ పదునెక్కుతోంది. నయా ఉదారవాద విధానాలను నెత్తికెత్తుకున్న కాంగెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే 1991లో ప్రైవేటీకరణ విధానాలనూ ముందుకు తీసుకువచ్చింది. అప్పటినుండి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వమూ ఏదో ఒక విధంగా బ్యాంకులను ప్రైవేటీకరించే లక్ష్యంతోనే పనిచేసింది. (వామపక్షాల ప్రభావం మూలంగా యుపిఎ-1 పాలనలో ఆ వేగం తక్కువగా ఉంది)
ఎన్నో కమిటీలు... లక్ష్యం ప్రైవేటే..
1991 తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బ్యాంకింగ్‌రంగంపై ఎన్నో కమిటీలను వేశాయి. ఈ కమిటీలన్నిటి లక్ష్యం ప్రైవేటీకరణే! ఆ కమిటీల సిఫార్సులన్నీ ఆ దిశలోనే బాటలు వేశాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలనూ చేసింది
కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు ఒకవైపు కమిటీలను వేస్తూ వాటి సిఫార్సుల అమలు పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకులను నీరుగార్చే ప్రక్రియను ఒక వ్యూహం ప్రకారం అమలు చేశాయి. బ్యాంకులకు క్యాపిటలైజేషన్ నిధులు సమకూర్చడాన్ని కుదించాయి. ప్రభుత్వ వాటాలను తగ్గించాయి. ప్రైవేటు బ్యాంకులకు అనుమతివ్వడం, చిన్న బ్యాంకులకు, పే మెంటు బ్యాంకులకు గ్రీన్‌సిగల్ ఇస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వపెద్దలే తప్పు పట్టడమన్నది ఒక ప్రణాళిక ప్రకారం సాగింది. 1997లో 47,300కోట్ల రూపాయలుగా ఉన్న ఎన్‌పిఎలు 2021 నాటికి 6,16,015 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.. చట్టాలను కఠినం చేసి, ఎన్‌పిఎల నుండి బకాయిల వసూళ్లకు సహకరించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా ఇన్సాల్వెన్సీ, బ్యాంక్ట్రప్సీ వంటి విధానాలను రూపొందించాయి. వాటి అమలుతో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న వారికి భారీ మొత్తంలో రాయితీలు ఇచ్చి బ్యాంకులను క్షవరం (హెయిర్ కట్) చేశాయి. 13 రుణ ఖాతాల్లో నుండి 4,46,800 కోట్ల రూపాయలు బ్యాంకులకు రావాల్సిఉండగా, ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా 1,61,820 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. మొత్తం 2,84,980 కోట్ల రూపాయలు (64శాతం) బ్యాంకులకు క్షవరమైంది.
దొంగల చేతికే బ్యాంకులు..!
బ్యాంకులు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య బ్యాడ్‌లోన్స్ అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సమస్యకు రైతులో, సామాన్యులో కారణం కాదు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొటడంలో దేశంలోనే పెద్ద కార్పొరేట్ సంస్థలది కీలక పాత్ర! ఇది రహస్యమేమి కాదు. పాలకులకు చాలా బాగా తెలుసు! అయినా, ఆ దొంగల చేతికే ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్ప చెప్పడానికి సిద్ధపడుతుండటమే విచిత్రం! దీనిని సమర్ధించుకోవడం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎన్‌పిఎలు తగ్గుతున్నాయని కేంద్రం ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఇది నిజం కాదు! వాస్తవానికి భారీ మొత్తంలో రుణాలను రద్దు చేయడం ద్వారా పుస్తకాల్లో ఎన్‌పిఎలు తగ్గుతున్న ట్లుగా కేంద్రం చూపుతోంది. 2018-19లో 1,83,202 కోట్ల రూపాయలను, 2019-20లో 1,75,876 కోట్ల రూపాయలను, 2020-21లో 1,31,894 కోట్ల రూపాయల కార్పొరేట్ బకాయిలను కేంద్రం రద్దు చేసింది. అంటే, మూడు సంవత్సరాల కాలంలో 4,90,972 కోట్ల రూపాయలను రద్దుచేసి, ఆ మేరకు ఎన్‌పిఎలు తగ్గాయని అది తమఘనతేనని చెప్పుకుంటోంది.
సంరక్షణకే సమ్మె...
ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకోసమే అనివార్య పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రకటించింది. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వేల కోట్ల రుణాలను వసూలు చేయాలని డిమాండ్ చేసింది. దీనికోసం అవసరమైన కఠిన చట్టాలను రూపొందించాలని, రుణాలు ఎగవేసే కార్పొరేట్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దేశ సమగ్రాభివృధ్దికోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను సంరక్షించడంతో పాటు, వాటిని మరితంగా విస్తరించాలని విజ్ఞప్తి చేసింది. అత్యున్నత బ్యాంకు బోర్డు స్థాయి అధికారులను నియమించే సమయంలో వారి నిబద్దతను పరీక్షించడానికి కఠిన నిబంధనలను రూపొందించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
యుపిఎ, ఎన్‌డిఎ హయాంలో బ్యాంకుల ఎన్‌పిఎలు
మార్చి31 నాటికి
స్థూల ఎన్‌పిఎ(రూ.కోట్లలో)
యుపిఎ1
2004 51.537
2005 48,399
2006 41,358
2007 38,968
2008 39,030
యుపిఎ2
2009 44,957
2010 59,927
2011 74,664
2012 1,17,000
2013 1,64,461
ఎన్‌డిఎ (మోడీ -1)
2014 2,16,739
2015 2,78,877
2016 5,39,955
2017 6,84,733
2018 8,95,600
ఎన్‌డిఎ (మోడీ -2)
2019 7,39,541
2020 6,78,318
2021 6,16,015
సంవత్సరం కమిటీ
1991 నరసింహం కమిటీ
1997 నరసింహం కమిటీ (2)
1999 వెర్మ కమిటీ
1999 కెవి కామత్ కమిటీ
2000 ప్రైవేటైజేషన్ బిల్లు
2006 తారాపోర్ కమిటీ
2007 రఘురామ్‌రాజన్ కమిటీ
2013 ఆర్బిఐ కమిటీ
2014 నచికేత్ కమిటీ
2014 పిజె నాయక్ కమిటీ
2015 గ్యాన్-సంగమ్ కమిటీ
2017 ఎఫ్ఆర్బిఎం చట్టం
బ్యాడ్‌లోన్స్ పేరిట బ్యాంకులకు క్షవరం (రూ.కోట్లలో)
రుణగ్రహీత రుణంమొత్తం చెల్లించిన మొత్తం బ్యాంకులకు ఎవరికి లబ్ధి నష్ట శాతం
ఎస్సార్ 54,000 42,000 23 మిట్టల్
భూషణ్ స్టీల్స్ 57,000 35,000 38 టాటా
జ్యోతి స్ట్రక్చ్ర్స్ 8,000 3,600 55 షరద్ సంఘీ
డిహెచ్ఎఫ్ఎల్ 91,000 37,000 60 పిరమాల్
భూషణ్‌పవర్ 48,000 19,000 60 జెఎస్‌డబ్య్లు
ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ 14,000 5,000 62 వేదాంత
మానెట్ ఇస్పాత్ 11,500 2,800 75 జెఎస్డబ్ల్యు
ఆమ్టెక్ 13,500 2,700 80 డివిఐఎల్
అలోక్ ఇండిస్టీస్ 30,000 5,000 83 రిలయన్స్ + ఎంఫిన్
లాంకో ఇన్ఫ్రా 47,000 5,300 88 కళ్యాణ్ గ్రూపు
విడియోకాన్ 46,000 2,900 94 వేదాంత
ఎబిసి షిప్‌యార్డు 22,000 1,200 95 లిక్విడేషన్
శివశంకరన్ ఇండిస్టీస్ 4,800 320 95 .....
13 ఖాతాల్లో రుణం మొత్తం 4,46,800
సర్దుబాటుతో చెల్లింపు 1,61,820
బ్యాడ్ లోన్స్‌తో బ్యాంకులకు నష్టం 2,84,980
నష్ట శాతం 64