Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే నెపంతో అదానీ క్యాపిటల్‌తో ఇటీవల ఒక వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 46 కోట్ల మంది ఖాతాదారులు, 22 వేల శాఖలున్న ఎస్బీఐ వ్యవసాయ విస్తరణ కోసం కేవలం 63 శాఖలు ఉన్న అదానీ క్యాపిటల్ సాయం కోరడమే విడ్డూరం. ఎస్బీఐ విశాలమైన కారిడార్లోకి కార్పొరేట్ అదానీకి ప్రవేశం కల్పించడం వెనక పెద్ద కుట్రే దాగి ఉంది. అదానీ స్టేట్ బ్యాంక్ ప్రతిష్టను ఉపయోగించుకుని వివిధ అభివృద్ధి ఏరియాల్లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. దీనికి మోడీ అన్ని విధాలా సహకరిస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం వల్ల ఆగ్రహంగా ఉన్న కార్పొరేట్లను బుజ్జగించేందుకు మోడీ ఆయన బ్యాంకుల ప్రైవేటీకరణ, సహకార బ్యాంకుల ధ్వంసానికి పూనుకున్నారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు చాలా ప్రమాదకరమైనది. 1970,1980 నాటి బ్యాంకుల జాతీయీకరణ చట్టానికి చేయతలపెట్టిన సవరణలు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు మరణ శాసనంగా పరిణమించనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ప్రైవేటీకరించే అధికారాన్ని ఇది కేంద్ర ప్రభుత్వానికి దఖలుపరుస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో 74 శాతం వరకు విదేశీ ఈక్విటీని ఇది అనుమతిస్తుంది. విదేశీ పెట్టుబడి ఆధిపత్యంలోని బ్యాంకు ఎలా ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక వైఖరితో ఉంటుందో త్రిసూర్‌లోని సిఎస్బి బ్యాంకు ఒక సంకేతం.
బ్యాంకు విలీనాలు ప్రైవేటీకరణకు ముందే జరిగిపోతున్నాయి. ఎస్బిఐ ద్వారా ఈ విధానాన్ని మరింత ముమ్మరం చేశారు. 2017 ఏప్రిల్ 1 నుండి రాష్ట్రాల ప్రాంతీయ అభివృద్ధి కోసం ఏర్పడిన ఎస్బిఐ అసోసియేట్ బ్యాంకులను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించింది. విలీనం తరువాత సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచేందుకు అనుమతించింది. శాశ్వత నియామకాలను రద్దు చేసి కాంట్రాక్ట్ విధానాన్ని అమలులోకి తెచ్చిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకే. 2018, 2020లో బ్యాంక్ విలీనాల్లో స్టేట్ బ్యాంక్‌దే ప్రధాన పాత్ర. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 28 నుంచి 12కి కుదించబడింది.
భారత బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారులకు (క్రోనీ కేపిటలిస్టులకు) అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. భారతీయ రిజర్వు బ్యాంక్ నియమించిన అధ్యయన కమిటీ బ్యాంకింగ్ వ్యవస్థలను స్వాధీనం చేసుకోవాలని కార్పొరేట్లకు సూచించింది. నష్టాల్లో కూరుకుపోయిన ముకేశ్ అంబానీకి చెందిన జియో పేమెంట్ బ్యాంకులో 30 శాతం వాటాను ఎస్బిఐ కొనుగోలు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్‌గా చాలా కాలం పనిచేసిన అరుంధతీ భట్టాచార్య పదవీ విరమణ తరువాత రిలయెన్స్ డైరక్టర్ల బోర్డులో సభ్యురాలిగా చేరడం యాదృచ్ఛికం కాదు. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో ఆవిర్భవించిన కార్పొరేట్ గవర్నెన్స్ కూటమి మోడీ హయాంలో మరింతగా విస్తరిస్తోంది. అదానీ, అంబానీ, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో రోల్ మోడల్‌గా పిలువబడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెత్తినెక్కి స్వారీ చేస్తూ, ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారు. మరో వైపు పార్లమెంటులో మెజారిటీని ఉపయోగించుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, బ్యాంకులను హౌల్సేల్గా ప్రైవేటీకరించేందుకు పూనుకుంటున్నది. దేశంలోని ఫైనాన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు నైవేద్యంగా అర్పిస్తున్నది. ఇది కార్మికుల, బడుగు జీవుల ప్రయోజనాలను పణంగా పెట్టడమే. బ్యాంకుల ప్రైవేటీకరణ చట్టానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, సకల జనులు ఐక్యమై పోరాడాలి. ప్రభుత్వ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడానికి బలమైన ఐక్య పోరాటాలే మార్గం.