Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందనీ, వారికి అవకాశాలు పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 50 శాతానికి మించి మహిళలకు అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌ను సైతం గుర్తించామనీ, కొలీజియంతో ఈ విషయం గురించి చర్చిస్తానని తెలిపారు. పాతఖాళీలను కూడా పూరించే విషయం పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఉమెన్ ఇన్ లా అండ్ లిటిగేషన్ (విల్) సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోిహ్లీకి తాజాగా జరిగిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రస్తుతం కిందిస్థాయి కోర్టుల్లో 30 శాతం మంది మంది, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 10-11 శాతం మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 33 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో నలుగురు మాత్రమే మహిళ జడ్జీలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. న్యాయమూర్తుల పదవుల కోసం పేర్లును సిఫార్సు చేసినప్పుడల్లా ఒకరిద్దరు మహిళల పేర్లు ఉండేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు చెబుతూ వస్తున్నామని చెప్పారు. న్యాయవాద వృత్తిలోనే కాదు, న్యాయమూర్తులుగా కూడా మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు.
పలు న్యాయస్థానాల్లో పరిస్థితులు, మౌళిక సదుపాయాల గరించి ప్రస్తావించిన సీజేఐ.. కోర్టు గదుల్లో మహిళలకు అనువైన వాతావరణం ఉండటం లేదిని అన్నారు. చాలా కోర్టుల్లో మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. న్యాయమూర్తులు కూడా విమర్శలను తట్టుకుంటూ ముందుకుసాగాలని కోరారు. జస్టిస్ హిమాకోహ్లీ గురించి మాట్లాడుతూ ఆమె చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు ఈ హౌదా ఎవరి దయాదాక్షిణ్యాలతోనో వచ్చిందికాదనీ, అంతా కష్టార్జితమన్నారు. ఆమె ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అలాగే, మాతృభాష అంశాన్ని కూడా సీజేఐ ఎన్వీ రమణ ప్రస్తావించారు. పిల్లలకు మాతృభాషలో బోధన అందించడం చాలా కీలకమని అన్నారు. ''మాతృభాషలో చదువుకుంటేనే పిల్లలు చాలా విశ్వాసంతో జీవిస్తారు. వారి భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు మన మనసు తొలుత మాతృభాషలో అర్థం చేసుకుంటుంది. తర్వాత దాన్ని ఇతర భాషల్లోకి తర్జుమా చేసుకుంటుంది. మన ఆలోచనల్ని ప్రభావితం చేసేది మాతృభాషే కాబట్టి అందులో బోధన చాలా ముఖ్యం'' అని జస్టిస్ ఏన్వీ రమణ పేర్కొన్నారు.