Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ : కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి మండలిలో కొనసాగించటం రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. లఖింపూర్ ఖేరిలో రైతులను కార్లతో తొక్కించి అమానుషంగా హత్య చేయించిన ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని యూపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించిన నేపథ్యంలో ఆయనను తక్షణమే మంత్రిమండలి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు అశీశ్ మిశ్రా తన తండ్రి ఆదేశాల మేరకు కుట్రపూరితంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు కారు నడిపించి హత్య చేశాడని సిట్ తన నివేదికను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు అందచేసిన విషయం తెలిసిందే. నిందితుడికి అన్ని విధాల సహకరించిన కేంద్ర మంత్రిని తన మంత్రివర్గంలో కొనసాగించటం ప్రధానమంత్రికి తగదని ఆయన అన్నారు. తన కొడుకు చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకోడానికి కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నారనీ, ఈ పరిస్థితుల్లో కూడా ఆ మంత్రిని ప్రధాని తన పక్కన తిప్పుకోవడం సమంజసం కాదని అన్నారు. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఉత్తర ప్రదేశ్ రైతు ఉద్యమ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారనీ, వారికి తమ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలిపారు.