Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్లకు దారులు తెరిచిన మోడీ సర్కారు
- ఆయుధంగా మారిన వేలం ప్రక్రియ నిబంధనలు
- బేస్ రేటు సెట్ చేయని ప్రభుత్వ సేకరణ సంస్థ నాఫెడ్
- తక్కువ ఓటీర్ కోట్ చేస్తూ మిల్లర్ల దోపిడీ
- నాలుగేండ్లలో దండుకున్నది రూ. 4600 కోట్లు
- ఆర్టీఐ ద్వారా బహిర్గతం
సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందాల్సిన పప్పు దినుసులు మిల్లర్లకు ఆదాయ వనరుగా మారింది. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఉదాసీన వైఖరి తోడైంది. ముడి పప్పుల ప్రాసెస్ కోసం నిర్వహించే వేలంపాట నిబంధనలు మిల్లర్లను అక్రమార్జనకు అలవాటు పడేలా చేస్తున్నాయి. 2018కి ముందున్న వేలం ప్రక్రియ స్థానంలో కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. ఇది మిల్లర్లకు ఆయుధంగా మారింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నది. గత నాలుగేండ్లలోనే మిల్లర్లు రూ. 4600 కోట్లు ఆర్జించారని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది.
న్యూఢిల్లీ : వేలం ప్రక్రియను తలకిందులు చేయడం ద్వారా పేదలకు అందించాల్సిన టన్నుల కొద్దీ పప్పు దినుసు లను మిల్లర్లు కొల్లగొట్టేందుకు మోడీ సర్కారు దారులు తెరిచింది. రిపోర్టర్స్ కలెక్టివ్ వేలం ఆర్కైవ్‌ల పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. సంక్షేమ పథకాల కోసం ముడి పప్పుల ను ప్రాసెస్ చేయడానికి మిల్లర్లను ఎంపిక చేసే ప్రభుత్వ సేకరణ ఏజెన్సీ అయిన నాఫెడ్.. 2018 నుంచి వేలాదికి పైగా వేలాలను నిర్వహించింది. బేస్ రేట్ లేదా ఫ్లోర్‌ను సెట్ చేయకుండానే ముందుకెళ్లింది. వేలం ద్వారా మిల్లర్లు చాలా లాభపడ్డారు. ప్రభుత్వ ఖజానాకు గండి గొట్టారు. 5.4 లక్షల టన్నులకు పైగా ముడి పప్పుల మిల్లింగ్ నుంచి నాలుగేండ్లలో కనీసం రూ. 4,600 కోట్ల ఆదాయాన్ని మిల్లర్లు ఆర్జించినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైన సమాచార పత్రాలు ఈ విషయాలను వెల్లడించాయి.
నాణ్యత ఉండదు..!
రక్షణ సేవలు, సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఉద్దేశించిన ఈ పప్పులు మోడీ సర్కారు తీరుతో అక్రమార్కులకు ఆదా య వనరుగా మారింది. ముఖ్యంగా, కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎం జీకేఏవై)లో భాగంగా అందించిన ప్రాసెస్ చేసిన పప్పు నాణ్యత లేదని రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. మరి కొన్ని రాష్ట్రాలైతే ఈ ప్రాసెస్ చేసిన పప్పులు వినియోగానికి అర్హం కాకపోవడంతో ఏకంగా తిరస్కరించడం గమనార్హం.
దిద్దుబాటు చర్యలు
ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. సందేహాస్పదమైన వేలాల గురించి సమీ క్షించాలంటూ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభు త్వ ప్రముఖ పరిశోధనా సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్-హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీహెచ్ ఈటీ) కూడా వేలంపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. '' పప్పు ధాన్యాలను సేకరణ, నిల్వ, ప్రాసెస్ ఎలా చేయాలన్న విషయంపై మేము ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం'' అని సీఐపీహెచ్‌ఈటీ డైరెక్టర్ నచికేత్ కొత్వాలివాలే చెప్పారు. నాఫెడ్ ద్వారా లక్షలాది టన్నుల పప్పుధాన్యాలను ఎలా సేక రించారు? ఎలా నిల్వచేస్తున్నారు? ఎలామిల్లింగ్ చేస్తు న్నారు? అనేదానిపై సమీక్షించడానికి ఇంటర్-ఏజెన్సీ కమి టీను ఏర్పాటు చేయాలని సదరు నివేదిక ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. మిల్లర్లను సంపన్నులు చేసే వేలంపాట ప్రక్రియ మొదట రైతులు, పేదల పేరిట వచ్చింది. 2015లో, బఠానీలు, పప్పుల ధరలు విపరీతంగా పెరగడంతో భారతదేశం ''దాల్ షాక్''ను ఎదుర్కొన్నది. ఆ సమయంలో సేకరణ బాధ్యతను నాఫెడ్‌కు అప్పగించారు. దీంతో తమ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా మరింత పప్పుధాన్యాలు ఉత్పత్తి చేసేలా రైతులను నాఫెడ్ ఒప్పించింది. నాఫెడ్ వద్ద నిల్వలు పోగుపడటంతో, ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద పప్పుధన్యాలను సబ్సిడీ, సరసమైన ధరలకు అందించాలని 2017లో ప్రతిపాదించింది. నాఫెడ్, కేంద్ర ప్రభుత్వం.. ముడి పప్పులను మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేయాలని నిర్ణయించాయి. అయితే, దీనికి ముందు పప్పుల మిల్లింగ్‌కు సంబంధించిన వేలం ప్రక్రియ పారదర్శకంగా ఉన్నది. అతి తక్కువ ధరకు ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్న బిడ్డర్‌ను ప్రభుత్వం కనుగొంటుంది. కానీ, నాఫెడ్ మాత్రం ఈ వేలం ప్రక్రియను రద్దు చేసింది.
లాభార్జన ఇలా..
ప్రస్తుత విధానం మిల్లర్లకు కాసులను తెచ్చిపెడుతున్నది. పప్పు దినుసులను మిల్ చేయడానికి, నిర్దేశించిన ప్రదేశాలకు డెలివరీ చేయడానికి సాధ్యమైనంత తక్కువ ధరను కోట్ చేయాలన్న నిబంధన బిడ్డర్లకు లేదు. బదులుగా, సాధ్యమయ్యే అత్యధిక అవుట్-టర్న్ రేషియో (ఓటీఆర్)ను కోట్ చేయాలనేది మాత్రం ఉన్నది. కాబట్టి, ముడి స్టాక్ నుంచి అత్యధిక మొత్తంలో ఓటీఆర్‌ను అందించే మిల్లర్‌ది పై చేయిగా ఉంటుంది. అయితే, మిలర్లు ఇక్కడే తమ తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఒక నిర్దిష్ట గ్రేడ్ ముడి సరుకు నుంచి సాధించగలిగే దాని కంటే తక్కువ ఓటీఆర్‌ను కోట్ చేస్తారు. దీంతో అదనపు పప్పును ఉప ఉత్పత్తులతో కలిపి బహిరంగ మార్కెట్లో విక్రయించి మిల్లర్లు లాభం పొందుతున్నారు. అంతేకాకుండా, ప్రతి టెండర్లో వారు ఎంత మొత్తం లాభం పొందారన్నదానిపై మాత్రం నాఫెడ్ లేదా ప్రభుత్వానికి స్పష్టత కానీ, సరైన సమాచారమూ లేకపోవడం గమనార్హం.