Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీల సస్పెన్షన్... లఖింపూర్ ఖేరీ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్
- వెల్‌లోకి దూసుకెళ్లి ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటన, ఎంపీల సస్పెన్షన్ అంశాలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో లఖింపూర్ ఖేరీ ఘటన ప్రణాళిక బద్ధ కుట్రలో భాగంగానే జరిగిందని సిట్ ఇచ్చిన నివేదికపైనా, రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టడంతో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ 40 నిమిషాలు, రాజ్యసభ 37 నిమిషాలు పాటే జరిగాయి. బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాల ఆందోళనతో సభ ఆరు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగింది. ప్లకార్డుల పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన మధ్య 28 నిమిషాలు పాటు జరిగిన సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 2.18 గంటలకు ప్రారంభమైన సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ 12 మంది సభ్యులను సస్పెండ్ చేశారనీ, వెంటనే సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్‌పై చర్చ చాలా ముఖ్యమైనదనీ, అలాగే తమ సహచర ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడం కూడా చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసి, వారిని కూడా చర్చకు అనుమతించాలి కోరారు. మరోవైపు ప్రతిపక్ష ఎంపీల వెల్‌లో ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం జరిగింది. దీంతో సభ ప్రారంభమైన మూడు నిమిషాలకే మళ్లీ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో లఖింపూర్ ఖేరీ ఘటన ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని సిట్ పేర్కొన్న అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమ ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఓం బిర్లా నిర్వహించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు 'వురు వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు హౌరెత్తించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను గంటన్నర సేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. రైతులను హత్య చేసిన వారిని తొలగించాలని, కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో సభ ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే నేటీ (గురువారం)కి వాయిదా పడింది.
ఇదేం తీరు.. రాహుల్ గాంధీ
పార్లమెంట్ ఆవరణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ లఖింపూర్ ఖేరీ ఘటనపై తమను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, అందుకే సభకు అంతరాయం కలుగుతోందని అన్నారు. లఖింపూర్ ఖేరీ హింస కేసుపై తీర్పు వచ్చిందనీ, ఒక మంత్రి ప్రమేయం ఉన్నదనీ, వారు కనీసం చర్చనైనా జరపాలని అన్నారు. అంతకు ముందు లఖింపూర్ ఖేరీ హింసాకాండపై రాహుల్ గాంధీ లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా వైదొలగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేష్ నోటీసు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కూడా ఇదే అంశంపై నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో లఖింపూర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా రాజ్యసభలో వాయిదా నోటీసు ఇచ్చారు. టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్ కూడా నోటీసులు ఇచ్చారు.
రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోరుపై ప్రివిలేజ్ నోటీస్
రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోరుపై ప్రతిపక్షాలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, సీపీఐ(ఎం)తో సహా ప్రతిపక్షాలు ప్రివిలేజ్ మోషన్‌ను సమర్పించాక.. సభకు హాజరవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శివసేన, ఐయుఎంఎల్ కూడా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలు తనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడంపై రాజ్యసభ సభ్యుడు, మాజీ సీజేఐ రంజన్ గొగోరు స్పందించారు. ''చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది'' అని పేర్కొన్నారు. తాను ఈ రోజు (బుధవారం) పార్లమెంటుకు హాజరుకావడం లేదనీ, గురువారం హాజరవుతారని గొగోరు తెలిపారు. రాజ్యసభకు గొగోరు ఇటీవల నామినేట్ అయ్యారు.రంజన్ గొగోరు ఒక ప్రయివేటు ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పార్లమెంటు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్లమెంటుకు హాజరుకావడంపై గొగోరు తాను నామినేట్ మెంబర్ అనీ, తనకు నచ్చినపుడు పార్లమెంటుకు వెళ్తాననీ, సమస్యలు లేవనెత్తుతానని అన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు. ''పార్లమెంటు అంటే మాట్లాడటం కాదు...వినడం కూడా''అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. గొగోరు వ్యాఖ్యలు పార్లమెంటును అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు.