Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ కార్పొరేట్ విధానాలపై విజయమిది
- కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు : ఆయా దేశాలకు చెందిన రైతు హక్కుల గ్రూపులు
న్యూఢిల్లీ : భారత్‌లో రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ శాంతియుతంగా ఉద్యమం సాగిన తీరు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మోడీ సర్కార్ మెడలువంచి వివాదాస్పద సాగు చట్టాల్ని రద్దు చేయటంలో విజయం సాధించినందుకు భారతీయ రైతులకు, రైతు సంఘాల నాయకులకు వివిధ దేశాల్లోని ఏడు రైతు హక్కుల గ్రూపులు అభినందనలు తెలియజేశాయి. మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలపై రైతులు సాధించిన విజయమని తెలిపాయి. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారని, ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు ఇందులో పాలుపంచుకున్నాయని రైతు హక్కుల గ్రూపులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
మోంట్రియాల్లోని రైతు హక్కుల గ్రూప్ సీఈఆర్ఏఎస్ , ఎడ్మాంటెన్కు చెందిన ఇండియన్ ఫార్మర్స్, వర్కర్స్ సపోర్ట్ గ్రూప్, సెక్యూలర్ పీపుల్స్ ఫౌండేషన్, వాంకోవర్‌లోని ఇండియన్ ఫార్మర్స్, వర్కర్స్ సపోర్ట్ గ్రూప్, అలాగే విన్నిపెగ్‌లోని ఇండియన్ ఫార్మర్స్ వర్కర్స్ సపోర్ట్ గ్రూప్, పంజాబీ లిటరరీ, కల్చరల్ అసోసియేషన్, వాంకోవర్‌కు చెందిన సన్సాద్ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశాయి.
గడ్డకట్టేంత చలి, భీకర వానలు, ఎండల్ని తట్టుకొని రైతులు పోరాటం సాగించారు. అహింసతో, శాంతియుతంగా ఉద్యమం సాగిన తీరు అమోఘం. రైతులకు సెల్యూట్ చేస్తున్నాం. అయితే రైతుల డిమాండ్లు నెరవేరాల్సి ఉంది. డబ్ల్యూటీఓలో భారత్ చేరిన తర్వాత మొదలైన ఆర్థిక సంస్కరణలతో దేశంలో అసమానతలు తీవ్రస్థాయిలో పెరిగాయి. ఈ అసమానతల్ని పోగొట్టే విధానాలు రావాల్సి ఉంది. వ్యవస్యాయ ఉత్పత్తుల మార్కెట్‌ను తమ హస్తగతం చేసుకునేందుకు బడా కార్పొరేట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వ్యవసాయరంగంలో అగ్రిటెక్నాలజీ, బిజినెస్ టెక్నాలజీని పెద్దఎత్తున తీసుకొచ్చేందుకు అమెరికా, బ్రిటన్లు ప్రయత్నిస్తున్నాయి. ఆయా దేశాల్లో వ్యవసాయ మార్కెట్లలో ప్రయివేట్‌కు తలుపులు తెరవాలని కోరుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు భారత్‌లో రైతులు తలపెట్టిన ఉద్యమం గొప్ప విజయాన్ని అందుకుందని రైతు హక్కుల గ్రూపులు అభినందించాయి.