Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీక్షాస్థలికి కడసారిగా మోకరిల్లి..
- సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేసిన రైతులు
- చివరిగా ఘాజీపూర్ సరిహద్దు నుంచి వెళ్లిన రాకేశ్ తికాయత్
న్యూఢిల్లీ : చారిత్రాత్మక ఉద్యమం విజయవంతం కావడంతో రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయడం పూర్తి అయింది. చివరిగా రైతు నేత రాకేశ్ తికాయత్ ఘాజీపూర్ (ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు) నుంచి స్వస్థలానికి వెళ్లారు. అంతకు ముందు ఏడాదికి పైనే దీక్షాస్థలి వద్ద ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రైతులు.. ఒక్కసారిగా ఆవేదన భరితుల య్యారు. కడసారిగా ఆ ప్రాంతంలో మోక రిల్లి నేలను ముద్దాడారు. ఉద్వేగభరితమ య్యారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందికి నమస్కరించగా.. వారూ ప్రతిస్పందిస్తూ.. వీడ్కోలు పలికారు. తమ మధ్య ఎలాంటి భేదాల్లేవనేలా వారి మధ్య అనుబంధం కని పించింది. ఏడాదిపైగా సుదీర్ఘంగా జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం విజయవంతం కావడంతో ఈనెల 11న సరిహద్దు ప్రాం తాల నుంచి ఇండ్లకు బయలు దేరారు. అప్పటి నుంచి రైతులు బృందాలుగా ఇండ్లకు పయనమవుతున్నారు. బుధవారం ఘాజీపూర్ సరిహద్దు నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సిసౌలి గ్రామానికి రాకేశ్ తికాయత్ ఇంటి వెళ్లడంతో ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయడం పూర్తయింది. 383 రోజులుగా ఘాజీపూర్‌లో ఉన్న రాకేశ్ తికాయత్, విజయోత్సవ వేడుకలు నిర్వహించాక.. ఇంటికి బయలు దేరారు. దేశభక్తి, ప్రాంతీయ గీతాలకు నృత్యాలు చేసుకుంటూ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. అలాగే తికాయత్ కాన్వారు వెళ్తుంటే, రైతులు దారిపొడువునా నీరాజనాలు పలికారు. తికాయత్‌కు భారీ స్థాయిలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. తికాయత్ కాన్వారు మోదీనగర్, మీరట్, దౌరాలా టోల్ ప్లాజా, మన్సూర్పూర్ మీదుగా ముజఫర్‌నగర్ జిల్లాలోని సిసౌలీకి నేతలు చేరుకుంటారు. ఘాజీపూర్ నుంచి సిసౌలి వరకు వందలాది ప్రదేశాల్లో సంబరాలు నిర్వహించారు. ''13 నెలలుగా వీధుల్లో పోరాటం చేసి ఇంటికి తిరిగి వస్తున్నాం. దేశ పౌరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే తమకు ఆహారం ఇతర పదార్ధాలు పంపిన వివిధ గ్రామాల ప్రజలకు రుణపడి ఉంటాం'' అని రాకేశ్ తికాయత్ అన్నారు. బీకేయూ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ మాట్లాడుతూ తికాయత్ ఇంటికి చేరుకోవడానికి ముందు తమ సంఘం ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. తికాయత్ రాక కోసం ఆయన గ్రామస్థులు, భారీ వేదికను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో స్వీట్లు తయారు చేశారు. గ్రామాన్ని అలంకరించారు. సిసౌలిలోని కిసాన్ భవన్లో ఏర్పాట్లు చేసినట్టు మాలిక్ తెలిపారు.