Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వివాహాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్లలోపు అమ్మాయిలకు వివాహం చేయకూడదని చట్టాలున్నాయి. అయితే, వివాహ కనీస వయస్సును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కేబినెట్ ఆమోదం తర్వాత, ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006కి సవరణను ప్రవేశపెట్టనుంది. వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు సవరణలు తీసుకురానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం జయ జైట్లీ నేతృత్వంలోని కేంద్రం టాస్క్‌ఫోర్స్ 2020 డిసెంబర్లో నీతి ఆయోగ్‌కి సమర్పించిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ''మాతృత్వ వయస్సు, తల్లి మరణాల రేటు (ఎంఎంఆర్), పోషకాహార స్థాయిల మెరుగుదల వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది. నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిగిన తర్వాత పలు సిఫార్సులు చేశామని జైట్లీ చెప్పారు. ''మేము 16 విశ్వవిద్యాలయాల నుంచి స్పందనలు తీసుకున్నాం.
15 కంటే ఎక్కువ ఎన్జీవోలు, ముఖ్యంగా గ్రామీణ, అట్టడుగు వర్గాలకు చెందిన వారు, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న రాజస్థాన్‌లోని ప్రత్యేక జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించాం'' అని జైట్లీ వివరించారు. వివాహ వయస్సు 22-23 సంవత్సరాలు ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. 18 ఏండ్లకే వివాహం కావడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరముందని అందుకు పెండ్లి చేసే వయస్సు పెంచాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఆడపిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది. త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో ఇందుకోసం సవరణలు తీసుకురానుంది కేంద్రం