Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రమేయమున్న కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. లోక్‌సభ కేవలం 17 నిమిషాలు, రాజ్యసభ కేవలం 12 నిమిషాలే జరిగింది. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ''అమిత్ షా సహాయ మంత్రి అజరు మిశ్రా రాజీనామా చేయాలి. అజరును తక్షణమే పదవి నుంచి ప్రధాని తొలగించాలి. లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలి'' అంటూ ప్లకార్డులు పట్టుకొని పెద్ద పెట్టున నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ లఖింపూర్ ఖేరీలో రైతులను హత్య చేశారనీ, కేంద్ర మంత్రి ప్రమేయం ఉన్నదని అన్నారు. మంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడని విమర్శించారు. అజరు మిశ్రా నేరస్థుడనీ, రైతులను హత్య చేసిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనీ, ఆయనను శిక్షించాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ అంశంపై చర్చించడానికి ప్రతిపక్షాలను అనుమతించాలనీ, అజరు మిశ్రాను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పీకర్ జోక్యం చేసుకొని ''ప్రశ్న అడగండి. నెంబర్ 262 ప్రశ్న జరుగుతుంది. మీరు ప్రశ్న అడగండి'' పేర్కొన్నారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ ఘటనపై మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన మైక్ కట్ చేసి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి మాట్లాడేందుకు అనుమతించారు. ''కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో ఆందోళన చేస్తున్నారు. ఆయన (రాహుల్ గాంధీ)కు మైక్ ఇచ్చారు. ఇది బాగోలేదు. కాంగ్రెస్ సభ్యులను వెనక్కి వెళ్లమనండి'' జోషి చెప్పారు. స్పీకర్ ఎంత వారించినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాలకే మద్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వెల్‌లో నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ జీవ వైవిధ్యం సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో ప్యానల్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే వాయిదా పడింది.
మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే సీన్ నడించింది. సభ ప్రారంభం కాగానే చైర్మెన్ ఎం. వెంకయ్యనాయుడు జీరో అవర్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షాలు లఖింపూర్ ఘటన, కేంద్ర మంత్రి అజరు మిశ్రా రాజీనామా చేయాలనీ, 12 సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. దీంతో వెంటనే సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (కోవిడ్-19)పై స్వల్పకాలిక చర్చను డిప్యూటీ చైర్మెన్ హరివంశ నారాయణ్ సింగ్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు ఇచ్చారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన మూడు నిమిషాలకే వాయిదా పడింది. డిసెంబర్ 8న తమిళనాడులో హెలికాప్టర్ ప్రయాణంలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బుధవారం ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి లోక్‌సభ సంతాపంతెలిపింది. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సంతాపం తీర్మానం చదివారు. అనంతరం సభ్యులంతా లేచిమౌనం పాటించారు. విజయ దివాస్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1971 బంగ్లాదేశ్ యుద్ధ వీరులకు, భారత సైనిక బలగాలకు పార్లమెంట్ ఉభయసభలు సంతాపం తెలిపాయి.
అజయ్ మిశ్రా నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి
కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా తప్పనిసరిగా నైతిక కారణాలతో రాజీనామా చేయాలని ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ డిమాండ్ చేశారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడం, లేదా అంగీకరించకపోవడం వేరే సమస్య అని, ముందు ఆయన రాజీనామా చేయాలని సూచించారు. సిట్ నివేదికలో 'కుట్ర' బయటపడిందనీ, ఎంత మంది రైతుల మరణాలు ముందే ప్లాన్ చేశారో తెలియదు కానీ ఒక్క ఉదంతమైనా బయటపడిందని తెలిపారు.
కొనసాగిన సస్పెండ్ ఎంపీల ధర్నా
సస్పెండ్‌కు గురైన 12 మంది ఎంపీల ధర్నా మంగళవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పలువురు ఎంపిలు సంఘీభావం తెలిపారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.