Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. మనీ లాండరింగ్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ విపరీతంగా ఉపయోగించడం వల్ల చట్టం ఔచిత్యాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రజలను జైలుకు పంపించడం సరైన చర్య కాదనీ, విచక్షణతో చట్టాన్ని వినియోగిస్తూ దాని విలువను కాపాడాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు హితవు పలికింది. లీజ్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో జార్ఖండ్‌కు చెందిన ఓ స్టీల్ కంపెనీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పై వాఖ్యలు చేసింది. ''మీరు చట్టాన్ని పలుచన చేస్తున్నారు. ఈ కేసు మాత్రమే కాదు. 10,000 రూపాయల కేసు, 100 రూపాయల కేసుకు వ్యతిరేకంగా మీరు దానిని ఆయుధంగా ఉపయోగించడం ప్రారంభిస్తే, ఏమి జరుగుతుంది? మీరు ప్రజలందరినీ కటకటాల వెనక్కి నెట్టలేరు. మీరు దానిని సహేతుకంగా ఉపయోగించాలి'' అని సుప్రీంకోర్టు తెలిపింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుతో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 'మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రొసీడింగ్‌లను విచక్షణారహితంగా ఉపయోగించడం ప్రారంభిస్తే చట్టం ఔచిత్యాన్ని కోల్పోతుంది'' అని జస్టిస్ ఏఎస్ బోపన్న అన్నారు.