Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజీ: గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. రాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు మిలింద్ నాయక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మిలింద్ నాయక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒక మహిళపై లైంగిక వేధింపుల కేసులో మిలింద్ నాయక్ హస్తమున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే, ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును జరుపుతుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మిలింద్ నాయక్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పనాజీలో బుధవారం రాత్రి సీఎంతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి పదవి నుంచి మిలింద్ నాయక్ వైదొలిగారు. క్యాబినెట్ సభ్యుడిగా ఉన్న మిలింద్ నాయక్ అధికార దుర్వినియోగానికి పాల్పడి బీహార్‌కు చెందిన ఒక మహిళపై లైంగిక వేధింపుల్లో భాగమయ్యారని గోవా కాంగ్రెస్ చీఫ్ గిరీశ్ చోడాంకార్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటం గోవా ప్రజలకు అవమానమని తెలిపారు. లైంగిక ఆరోపణల కేసులో మిలింద్‌ను పోలీసులు విచారించడం ప్రారంభించాలని చోడాంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర విభాగ ఉపాధ్యక్షుడు సంకల్ప్ అమోంకార్.. మిలింద్ నాయక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, బాధితురాలితో మిలింద్ జరిపిన సంభాషణకు సంబంధించిన ఆడియోను ఆయన బటయ పెట్టారు. మహిళను లైంగికంగా వేధిండమే కాకుండా ఆమెను అబార్షన్‌కు బలవంతం చేసి తిరిగి తమ పైనే కేసులు పెట్టించేలా మిలింద్ చేశాడనీ, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించినట్టు అమోంకార్ వివరించారు.
దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం కోసమే మిలింద్ నాయక్ మంత్రి పదవికి రాజీనామా చేశారని సమావేశమనంతరం సీఎం సావంత్ తెలిపారు. మిలింద్ రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి స్థానం ఖాళీగానే ఉంటుందనీ, అతని శాఖలు తానే చూసుకుంటానని వివరించారు. గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఇలాంటి సందర్భంలోనే మంత్రిపై లైంగిక ఆరోపణలు రావడం అధికార బీజేపీకి భారీ షాక్ అని విశ్లేషకులు వివరించారు.