Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 42 శాతం కనిష్టానికి భారత ఎంప్లారుమెంట్ రేటు
- ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ : ఐఎల్ఓ
- కార్మిక భాగస్వామ్య నిష్పత్తి 40.15 శాతానికి తగ్గుదల : సీఎంఐఈ
న్యూఢిల్లీ: జాతీయోత్పత్తి మహమ్మారి పూర్వస్థాయికి తిరిగి వచ్చినప్పటికీ, భారత దేశ ఉపాధి రేటు ఇటీవలి కాలంలో దాదాపు 42 శాతం కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) సమాచారం ప్రకారం.. మనదేశంతో పోల్చి తగ్గ ఆర్థికవ్యవస్థల్లో భారత దేశం ఉపాధి రేటు చాలా తక్కువగా ఉన్నదని ఐఎల్ ఓ చెప్పింది. లేబర్ పార్టిసిపేషన్ రేటు( ఎల్పీఆర్) అనేది ఆర్థిక వ్యవస్థలో ఎంత మంది ఉపాధి పొందగల వ్యక్తులు ఉన్నారు. వాస్తవానికి పని కోసం వెతుకుతున్నారు అనేది అర్థం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) సమాచారం ప్రకారం.. భారతదేశ ఎల్పీఆర్ ఈ ఏడాది మార్చిలో 41.38శాతం (దాదాపు ఐఎల్ఓ గణాంకాల లాగానే) గా ఉన్నది. కానీ, ఇది గత నెలలో 40.15 శాతానికి పడిపోవడం గమనించాల్సిన అంశం. అంటే భారతదేశంలో 60 శాతం మంది ఉపాధి పొందగల వ్యక్తులు జాబ్ మార్కెట్ నుంచి పడిపోయారు. అయితే, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇటీవల కాలంలో ఎల్పీఆర్లో అసాధారణ క్షీణతపై పాలకులు పెద్దగా దృష్టి పెట్టలేదని సీఎంఐఈ సీఈఓ మహేశ్ వ్యాస్ అన్నారు. సీఎంఐఈ ప్రకారం.. 2017 మార్చిలో ఎల్పీఆర్ 47 శాతంగా ఉన్నది. ఇది కేవలం నాలుగు ఏండ్లలో 40శాతానికి పడిపోయింది. ఈ క్షీణతలో ఎక్కువ భాగం మహమ్మారికి ముందే జరగడం గమనించాల్సిన అంశం.
ఆ దేశాల కంటే వెనకే..!
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో పాటు ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలలో 60 శాతం కంటే ఎక్కువ మంది ఉపాధి పొందగల వ్యక్తులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే.. ఇక్కడ దాదాపు వంద కోట్ల మంది ఉపాధి పొందగలిగే వ్యక్తులున్నారు. కానీ ఇందులో 40 కోట్ల మంది (40 శాతం మంది)
మాత్రమే ఉద్యోగాలు చేయోడమో..ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పొరుగున్న ఉన్న దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో సైతం ఇలాంటి 47 శాతం మంది వ్యక్తులు ఉద్యోగాల కోసం వెతుకుతుండటం గమనార్హం.
మహిళల్లోనూ ఉపాధి తక్కువే
భారత్‌లో మహిళల్లో ఉపాధి రేటు చాలా తక్కువగా ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఇది ఆందోళనకరంగా తయారైంది. ఇక్కడ మహిళల్లో ఎల్పీఆర్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. అంటే, 90 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు లేబర్ మార్కెట్‌కు దూరంగా ఉన్నారు. అయితే, లేబర్ మార్కెట్ నుంచి 90 శాతం మంది మహిళలు బయట ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఎలా జరుగుతుందని నిపుణుల ప్రశ్నించారు. భారత్‌లో అతి తక్కువ కార్మిక భాగస్వామ్యాన్ని మాత్రమే కాకుండా చురుకైన శ్రామిక శక్తిలో ఉన్నవారి ఉపాధి నాణ్యత, ఆదాయాన్ని కూడా మరింతగా విశ్లేషించాలని నిపుణులు సూచించారు. ఇందుకు మోడీ సర్కారు ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని వివరించారు. 2021-22 ఆర్థిక సర్వే ఈ ప్రశ్నను ముందుగా పరిష్కరించాలని చెప్పారు. 1991 సంస్కరణల తర్వాత ఏ ప్రధాని పాలనలో చూడని అత్యల్ప ఉపాధి రేటు మోడీ హయాంలో ఉన్నట్టు పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నదని విశ్లేషకులు తెలిపారు. అయితే, ఇవన్నీ పక్కకు పెట్టి యూపీ ఎన్నికలకు ముందు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో మోడీ బిజీగా ఉన్నారనీ, ఇవేవీ దేశ ఆర్థికాభివృద్ధిని పూర్తీగా భర్తీ చేయవని వారు ఆరోపించారు. విశేషమేమిటంటే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలో నిరుద్యోగం నాలుగు నుంచి 19 శాతం (దాదాపు ఐదు రెట్లు) పెరిగినట్టు కార్మిక ఆర్థికవేత్త సంతోశ్ మెహ్రోత్రా తెలిపారు.