Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహమ్మారి, పెరుగుతున్న ధరల ప్రభావం
- లక్షలాది మందికి అందని సరైన ఆహారం
- ఆసియాలో పరిస్థితులపై యూఎన్ నివేదిక
బ్యాంగ్‌కాక్: ఆసియాలో ఆహార భద్రత ఆందోళనకరంగా మారింది. ప్రజలకు తిండి దొరకడం కష్టమైంది. కొంతకాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యవసరాల ధరల కారణంగా ఆసియా దేశాల్లోని ప్రజలు ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్)కి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తన నివేదికలో పేర్కొన్నది. ఆసియాలో దాదాపు 180 కోట్ల మంది ప్రజలకు పోష్టికాహారం అందుబాటులో లేదని ఇది వివరించింది.
ఎఫ్ఏఓ నివేదిక సమాచారం ప్రకారం.. 2020లో ఆహార భద్రత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ఆయా దేశాల ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు, ఆంక్షలు వంటి కారణంగా ఈ ఏడాది పరిస్థితులు మరింతగా క్షీణించాయి. అయితే, ఆహార భద్రత మెరుగుదల కోసం సమగ్ర చర్యలను ఎఫ్ఏఓ కోరింది. సంస్థ ఆహార ధరల సూచిక గతేడాది దాదాపు మూడోవంతు పెరిగిందని ఎఫ్ఏక్యూ ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్ ఎకనమిస్ట్ డేవిడ్ దవే తెలిపారు. ఆరోగ్యానికి కీలకమైన ఆయిల్ ధరలు 74శాతం పెరిగాయని వివరించారు. పెరుగుతున్న ధరలు వినియోగదారుల కొనుగోలుశక్తిపై ప్రభావాన్ని చూపుతున్నాయని దవే ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు తాము సంపాదించిన మొత్తంలో ఆహారం పైనే ఖర్చు చేయాల్సి వస్తున్నదనీ, ఇది ఆర్థికంగానూ వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
అత్యవసర సమస్యగా ఆకలి
దక్షిణాసియాలో దాదాపు 16 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పపువా న్యూ గినియా, తూర్పు తైమూర్లలో ఆకలి అత్యవసర సమస్యగా ఉన్నది. 2000 ఏడాదిలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే కొంత మెరుగుదల వచ్చినప్పటికీ అది చాలా మందకొడిగా ఉన్నది. కొన్ని పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. ఆసియాలోని పది దేశాలలో ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో 30 శాతం కంటే ఎక్కువ మంది పెరుగుదల సమస్యను (వయసుకు తగిన ఎత్తు లేకపోవడం) ఎదుర్కొంటున్నారు. ఇక గతేడాది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 3.1 కోట్లకు పైగా చిన్నారులు తమ హైట్‌కు తగిన బరువు లేరు. ఇది 2022 నాటికి నాలుగు కోట్లకు చేరుకుంటుందని అంచనా. మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, రాజకీయ అస్థిరత వంటివి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయనీ, వీటిని ఆయా దేశాలు ఎదుర్కొని ప్రజలకు సరైన, సరిపడా ఆహారం అందేలా చూడాలని నివేదిక సూచించింది. రైతులు, మహిళలు, చిన్నారులపై దృష్టి పెట్టాలని వివరించింది.