Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణపై గళమెత్తిన ఉద్యోగులు
- తొలి రోజు సమ్మె సక్సెస్
- దేశవ్యాప్తంగా నిరసనలు : యూఎఫ్బీఐ, బెఫీ
- కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించే చర్యకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్యాంక్ బచావో...దేశ్ బచావో (బ్యాంకులను కాపాడండి...దేశాన్ని రక్షించండి) అంటూ బ్యాంకు ఉద్యోగులు నినదించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని గళమెత్తారు. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చాయి. దేశంలోని పలు బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బెఫీ, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ,, ఎన్సీబీఈ, ఎఐబీఓఏ, ఐఎన్బీఈఎఫ్, ఐఎన్బీఓసీ, ఏఐబీఈఏ, ఎన్ఓబీడబ్ల్యూ తదితర తొమ్మిది బ్యాంకు యూనియన్ల వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె గురువారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మూసివేయబడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్రాంచ్లలో డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్ క్లియరెన్స్, లోన్ అప్రూవల్లు వంటి సేవలు, లావాదేవీలన్నీ సమ్మె కారణంగా ప్రభావితమయ్యాయి. అయితే ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
సమ్మెలోకి తొమ్మిది లక్షలమందికి పైగా...
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు సమ్మె జరుగుతుంది. అన్ని బ్రాంచ్లు, రోడ్లపై వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా మద్దతును తెలిపారు. దేశవ్యాప్తంగా సమ్మె తొలి రోజు విజయవంతమైందని
యూఎఫ్బీయూ జాతీయ కన్వీనర్ సంజీవ్ కె బంద్లీష్ తెలిపారు. బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరించే ఉద్దేశాన్ని ప్రకటించినప్పటి నుంచి యూనియన్లు ఆందోళనలు చేస్తున్నాయని బెఫీ ప్రధాన కార్యదర్శి దేబాశిష్ బసు చౌదరి పేర్కొన్నారు. బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించడానికి జాబితా చేయబడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. దేశానికి ప్రైవేట్ బ్యాంకుల అవసరం లేదని, భారీ లోన్ తీసుకున్నవారి నుంచి రికవరీ చేయాలని పిలుపు నిచ్చారు. ప్రయివేట్ బ్యాంకులు బాగా పని చేస్తాయని అంటున్నారు కాదా, మరి చాలా ప్రయివేట్ బ్యాంకులు ఎందుకు దివాలా తీశాయి? అని ప్రశ్నించారు. ప్రయివేట్ కంపెనీలే మేజర్ ఎన్పీఏలని, వారిని ఎందుకు జప్తు చేసేందుకు బ్యాంకులను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బ్యాంకు డిపాజిట్ల భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే, రైతులు, సూక్ష్మ పరిశ్రమల వంటి పేద వర్గాలకు రుణాలు అందకుండా చేసి, ఉద్యోగాల తొలగింపునకు కారణమయ్యే బ్యాంకు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా మాట్లాడాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం చేయాలని, ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అన్ని బ్యాంకులు లాభాల్లోనే ఉన్నాయని, ఎందుకు ప్రయివేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. తాము బ్యాంకుల ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఉద్యోగ భద్రతపైన దాడి చేయడమే ప్రయివేటీకరణ లక్ష్యమనీ, ప్రయివేట్ బ్యాంక్లు వ్యతిరేకంగా ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 29-30 తేదీల్లో సమావేశమైన యూఎఫ్బీయూ, డిసెంబర్ 4 వరకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ధర్నాతో సహా ఆందోళనలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. డిసెంబర్ 10న ట్విటర్ క్యాంపెయిన్ ప్లాన్ చేయగా.. డిసెంబరు 14న ప్రధానికి ఆన్లైన్ పిటిషన్ను సమర్పించామని తెలిపారు.
''బిల్లును ప్రవేశపెట్టిన రోజున, పార్లమెంటు ముందు ప్రదర్శన ఉంటుంది'' అని ఆయన అన్నారు. సమ్మెకు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(డబ్లూఎఫ్టీయూ) మద్దతు తెలిపింది.